ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్లో మంటలు..రెండు బోగీలు దగ్ధం

ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు..యాదాద్రి జిల్లా పగిడిపల్లిలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఎస్ 4, ఎస్5, ఎస్ 6 బోగీలు  దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  రైల్లో పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తయ్యారు. లోకోపైలెట్ కు సమాచారం అందించారు. దీంతో లోకోపైలెట్ రైలును నిలిపివేయడంతో ప్రయాణకులంతా దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మంటల్లో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి, పగిడిపల్లి మధ్య నిలిచిపోయింది. 

బోగీల్లో మంటలు అని తెలిసిన వెంటనే.. ఆగిన రైలులో నుంచి ప్రయాణికులు అందరూ కిందకు దిగి పరుగులు తీశారు. బోగీల్లోని తమ సామానులు తీసుకోవటం కోసం హడావిడి పడ్డారు. ఇటీవల కాలంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలను గుర్తు చేసుకుని హడలి పోయారు ప్రయాణికులు. రైలు బోగీలకు దూరంగా వెళ్లిపోయారు.