ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్..ఇది కోల్ కతా నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు. ఎప్పటిలాగే జులై 06వ తేదీ గురువారం రాత్రి 8గంటల 35 నిమిషాలకు హౌరా జంక్షన్ నుంచి బయలుదేరింది. భువనేశ్వర్, బ్రహ్మపూర్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ వస్తుంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి రాగానే S4 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటి వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ..పాటలు వింటూ.. కొందరు పరిసర ప్రాంతాలను చూస్తూ ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పొగలు రావడంతో అరుపులు..కేకలు పెట్టారు. ఏమైందంటూ ఆందోళన చెందారు. మంటలు కనిపించడంతో మరింత భయపడ్డారు. ఏం అవుతుందో..బతికి బట్టకడతామా అంటూ ఏడుపు మొదలుపెట్టారు.
రైలు ఆగింది..పరిగెత్తారు..
ఓ వైపు మంటలు వ్యాపిస్తుండగా..ఒక్కసారిగా రైలు ఆగింది. వెంటనే ప్రయాణికులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు ఆతృత పడ్డారు. బోగీల నుంచి బయటకు దూకేశారు. కొందరు తోసుకున్నారు. మరికొందరు ఎమర్జెన్సీ కిటికిలో నుంచి బయటపడ్డారు. అయితే ఒక్కో బ్యాగు ఉన్న వారు త్వరగా బయటకు దూకేశారు. బోగీల నుంచి దూరంగా పరిగెత్తారు. కానీ రెండు మూడు ..అంతకంటే ఎక్కువ బ్యాగులు ఉన్నవారి పరిస్థితి దారుణం. ఓ వైపు మంటలు పెరిగిపోతున్నాయి. బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తున్నాయి. మరో వైపు కిక్కిరిసిన ప్రయాణికుల నుంచి బయటపడాలి. ఇంకో వైపు బ్యాగులు బయటకు తీసుకెళ్లిపోవాలి. ఈ పరిస్థితుల్లో సాహసం చేశారు. తమ బ్యాగులను తీసుకుని ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దూకేశారు. చూస్తుండగానే మంటలు బోగీలకు వ్యాపించాయి. ఈ సమయానికి ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ :ఆ లేఖ వచ్చిన వారం రోజుల్లోనే ఫలక్నుమా రైల్లో మంటలు.. ప్రమాదమా లేక కుట్రా ?
ఎవరెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి...
మంటలు వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయాణికులు చేసిన సాహసాలు వర్ణనాతీతం. బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఒకరికొకరు కనిపించని పరిస్థితి. కుటుంబ సభ్యులు ఎక్కుడున్నారో తెలియని స్థితి. అయినా కూడా ప్రయాణికులు ముందుగా బయటకు దూకడమే టార్గెట్ అన్నట్లు దూకేశారు. ప్రాణాలతో బయటపడితే చాలు..కుటుంబ సభ్యులను తర్వాత వెతుక్కోవచ్చు అనుకున్నారు. తమ దగ్గర ఉన్న బ్యాగులతో బయటపడ్డారు. ప్రాణాలు రక్షించుకున్నారు. బోగీలకు దూరంగా పరిగెత్తారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యుల పేర్లను పిలుస్తూ..ఒక్కటయ్యారు.