రూపాయి పతనం.. విదేశీ చదువులు భారం.. శాపంగా మారిన వీసా పాలసీలు

రూపాయి పతనం.. విదేశీ చదువులు భారం.. శాపంగా మారిన వీసా పాలసీలు
  • యూకే, యూఎస్‌‌‌‌, కెనడా వీసా పాలసీలతో  ఇబ్బంది పడుతున్న స్టూడెంట్లు
  • రూపాయి పతనంతో పెరిగిన .. విదేశీ చదువుల భారం
  • గత ఆరు నెలల్లో డాలర్ మారకంలో  5 శాతం క్షీణించిన మన కరెన్సీ విలువ
  • రూ. 50 లక్షలతో పోయే ఖర్చులపై  రూ.2.5 లక్షలు అదనపు భారం 
  • యూకే, యూఎస్‌‌‌‌, కెనడా వీసా పాలసీలతో  ఇబ్బంది పడుతున్న స్టూడెంట్లు

న్యూఢిల్లీ:రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుండడం విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్లకు శాపంగా మారింది. వీరిపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. ఇక్కడి నుంచి  పేరెంట్స్ పంపే డబ్బులు సరిపోవడం లేదు.   దీంతో పాటు ఎడ్యుకేషన్ పూర్తయ్యాక పొందే వర్క్ వీసా రూల్స్‌‌‌‌ను యూఎస్, కెనడా, యూకే వంటి దేశాలు కఠినం చేశాయి. చదువు పూర్తయ్యాక డబ్బు సంపాదించడం కష్టంగా మారుతోంది.  

లోన్లను తిరిగి చెల్లించడం ఆలస్యమవుతోంది. గత ఆరు నెలల్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 5 శాతం పడింది.  83.5 లెవెల్ నుంచి 87.37 కి దిగొచ్చింది. ఆరు నెలల కిందట   ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు ఏడాదికి  రూ. 50 లక్షలు సరిపోతే, ఇప్పుడు అదనంగా రూ.రెండున్నర  లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు యూకే తన వర్క్ వీసా రూల్స్‌‌‌‌ను మార్చింది. 

చదువు పూర్తయిన రెండేళ్ల తర్వాత కూడా స్టే చేయాలంటే ఇంటర్నేషనల్  గ్రాడ్యుయేట్లు    36 వేల నుంచి 40 వేల పౌండ్ల జీతం ఇచ్చే గ్రాడ్యుయేట్ జాబ్‌‌‌‌ను పొందాల్సి ఉంటుంది. కెనడా కూడా ఇండియన్ స్టూడెంట్లకు సంబంధించి ఇమ్మిగ్రేషన్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను కఠినం చేసింది.  స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్‌‌‌‌ వీసా ప్రోగ్రామ్‌‌‌‌ను రద్దు చేసింది. ‘చదువు పూర్తయ్యాక వర్క్‌‌‌‌ వీసాతో డాలర్లలో  సంపాదించేవారు. ఆ డబ్బులతో ఇండియాలో తీసుకున్న లోన్లను పెద్ద మొత్తంలో తీర్చేసేవారు. వీసా రూల్స్ ప్రభావం అండర్‌‌‌‌‌‌‌‌గ్రాడ్యుయేట్‌‌‌‌ స్టూడెంట్లపై  ఎక్కువగా ఉంది. జాబ్స్   దొరకడం కష్టంగా మారింది. యూఎస్‌‌‌‌లో చదివే వారు ఏడాదికి సగటున రూ.1.5 కోట్లను ఖర్చు చేస్తున్నారు’ అని  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ క్రెడిలా ఫౌండర్ అజయ్ బొహ్రా పేర్కొన్నారు. 

స్టూడెంట్లు లోన్లను తీర్చడానికి  ఎక్కువ టైమ్‌‌‌‌ తీసుకోవడం లేదా ఎక్కువ ఈఎంఐ చెల్లిస్తున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడంతో ఇండియాకు తిరిగొచ్చే స్టూడెంట్లపై భారం పెరుగుతోంది. ‘యూఎస్‌‌‌‌లో చదువుతున్న నా కూతురి  ఫుడ్‌‌‌‌, బోర్డింగ్ ఖర్చుల కోసం ఒకప్పుడు నెలకు 900 డాలర్లు పంపేవాళ్లం. ఇప్పుడు సేమ్ అమౌంటే (రూ.లలో) పంపినా, 800 డాలర్లే చేరుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం వేసిన ట్యాక్స్ కలెక్టెడ్‌‌‌‌ ఎట్ సోర్స్ (టీసీఎస్‌‌‌‌) తో అదనపు భారం పడుతోంది. ట్యాక్స్ చెల్లించిన అమౌంట్‌‌‌‌పై మళ్లీ టీసీఎస్‌‌‌‌ రూపంలో ట్యాక్స్ కడుతున్నా. 

రిఫండ్ పొందడానికి వీలున్నా, ట్యాక్స్ చెల్లించిన నా డబ్బులు ఏడాది పాటు బ్లాక్ అవుతున్నాయి’ అని హైదరాబాద్‌‌‌‌లో ఉంటున్న సుధా పాయ్ పేర్కొన్నారు. రూపాయి కదలికలు సాధారణమే అయినా, ఈ ఏడాది మాత్రం డాలర్ మారకంలో భారీగా క్షీణించింది. విదేశాల్లో చదువులు భారంగా మారాయి. ఫారిన్ కరెన్సీ లోన్లను స్టూడెంట్లు తీసుకోవద్దని, ఇండియాకి తిరిగొచ్చాక ఇటువంటి లోన్లను తీర్చడం కష్టంగా మారుతుందని కెరీర్ కౌన్సిలర్ కరన్‌‌‌‌ గుప్తా అన్నారు.   

ఆర్థిక సాయాన్ని, స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లను ఇచ్చే యూనివర్సిటీలకు అప్లయ్ చేయాలని సలహా ఇచ్చారు.  తొందరగా లోన్ తీసుకొని, యూనివర్సిటీ అకౌంట్లకు పంపడం ద్వారా కూడా రూపాయి పతనం నుంచి కొంత బయటపడొచ్చని అన్నారు.