సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌ భవనం నేలమట్టం

సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌ భవనం నేలమట్టం
  • స్టేషన్‌‌ ఆధునీకరణలో భాగంగా కూల్చివేసిన రైల్వే శాఖ
  • ప్రపంచస్థాయి సౌకర్యాలతో కొత్త భవన నిర్మాణం

హైదరాబాద్​సిటీ, వెలుగు:చారిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భవనం చరిత్రలో కలిసిపోయింది. నిజాం హయాంలో హైదరాబాద్ స్టేట్ రైల్వేస్ పేరుతో ఒక వెలుగు వెలిగిన ఈ స్టేషన్​భవనాన్ని ఆధునీకరణలో భాగంగా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1874లో ఈ భవనాన్ని నిర్మించాడు. దీనితో పాటు కాచిగూడ, నాంపల్లి, బేగంపేట, మౌలాలి రైల్వేస్టేషన్లు నిజాంల కాలంలోనే నిర్మించారు. 

నవాబుల దర్పాన్ని, అసఫ్ జాహీల తరహా నిర్మాణ శైలిని తెలిపేలా ఈ స్టేషన్ల నిర్మాణం జరిగింది. 1874 నుంచి 1916 వరకూ నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేస్ (ఎన్జీఎస్ఆర్) సేవలు అందిస్తూ వచ్చింది. నిజాం స్టేట్‌‌లో సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్‌‌గా కొనసాగుతూ వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో ఎన్జీఎస్ఆర్‌‌‌‌ను జాతీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రైల్వేస్‌‌లో ఈ స్టేషన్‌‌లో విలీనమైంది. ప్రస్తుతం కూలుస్తున్న ఈ రైల్వే స్టేషన్ భవనాన్ని 1952లో రెనోవేట్‌‌ చేశారు. 

150 సంవత్సరాల పాటు ప్రయాణికులకు సేవలందిస్తున్న ఈ రైల్వే స్టేషన్‌‌కు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీంతో పాత భవనాలు కూల్చి స్టేషన్‌‌ను వర్టికల్‌‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఈ స్టేషన్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ 11,500 చ.మీ. విస్తీర్ణంలో ఉండగా, దానిని 37,500 చ. మీ. విస్తీర్ణంలో విస్తరించేందుకు ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. 

రూ.720 కోట్లతో పనులు..

సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌ను రూ.720 కోట్లతో రైల్వే శాఖ ఆధునీకరిస్తున్నది. రైల్వే స్టేషన్‌‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులకు రద్దీకి ఇబ్బందుల్లేకుండా స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ మాదిరిగా రూపుదిద్దనున్నట్టు అధికారులు తెలిపారు. 

స్టేషన్‌‌ లోపల షాపులు, ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ కౌంటర్లు నిర్మిస్తున్నారు. స్టేషన్‌‌ను జీ+3 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌‌‌‌గా దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్‌‌కు రెండు వైపులా రెండు ట్రావెలర్లతో పాటు రెండు నడక మార్గాలను నిర్మిస్తున్నారు. లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

స్టేషన్‌‌కు ఈస్ట్ వైపు ఒకస్కైవేను మెట్రో స్టేషన్‌‌తో అనుసంధానం చేస్తున్నారు. 5కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. అడ్వాన్స్‌‌డ్‌‌ సెక్యూరిటీ సిస్టమ్‌‌తో పాటు మొత్తం స్టేషన్‌‌ కవర్ చేస్తూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎల్ఈడీ లైటింగ్, ఈవీ ఛార్జింగ్‌‌ కేంద్రాలు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు.