కరెంట్ కాంతుల వెనుక అబద్ధపు చీకట్లు

కరెంట్ కాంతుల వెనుక అబద్ధపు చీకట్లు

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉత్పత్తే లేదు, కరెంటే లేదనే విధంగా ప్రజల మెదళ్లలోకి చొప్పించేలా ప్రభుత్వ తీరు కనబడుతున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ పేరుతో రాష్ట్రం ఏర్పడ్డాకనే ఇక్కడ కరెంట్ ఇన్ స్టాల్ కెపాసిటీ పెరిగినట్టుగా గతంలో లేనట్టుగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడేకంటే ముందు కరెంటే లేదా?  కేసీఆర్ గద్దెనెక్కాకే కరెంట్ వెలుగులు చూశామనే విధంగా ప్రచారం విజయోత్సవాల తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది.

దేశంలో ఎక్కడా లేని విధంగా కరెంట్ ఇస్తున్నామన్న ఘనత తమదే అంటున్న కేసీఆర్ మాటల్లో నిజమెంత? తెలంగాణ మాదిరే దేశానికి కరెంట్ ఇస్తామంటున్న కేసీఆర్ ప్రకటనలో నిజాయతీ ఎంత? తెలంగాణలో కరెంట్ వెలుగుల వెనుక కాంగ్రెస్ చరిత్ర ఉందని, కాంగ్రెస్ పాలనలో నిర్మాణం చేసిన విద్యుత్ ప్లాంట్స్ తెలంగాణకు వెలుగులు అందిస్తుంటే, కేసీఆర్ పాలనలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్స్ సాంకేతిక సమస్యల సుడిగుండంలో చిక్కాయని, కరెంట్ వెలుగుల వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్లు కమ్మాయని కాంగ్రెస్​ నేతలంటున్న మాటల్లో నిజమెంత? వాస్తవాలేం చెప్తున్నాయి? 

రాష్ట్రం ఏర్పడే నాటి కంటే ముందు..

తెలంగాణ ఏర్పడి దశాబ్దం కాకపోయినా తెలంగాణలో దశాబ్ది విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్​ విజయోత్సవం పేరిట నాయకులు అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేశారు. కరెంట్ వెలుగుల వెనుక కేసీఆర్ చరిత్ర ఉన్నదా? అనే చర్చ చేయక తప్పదు. యావత్ దేశంలో రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇస్తామని కేసీఆర్ సంచలన ప్రకటనలు, కోతల్లేని కరెంట్ ఇస్తున్న ఘనత తమదేనని, కరెంట్ పోతే ఇప్పుడు వార్త, అలా తాము కరెంట్ విషయంలో ఎంతో సాధించామని గొప్పలు చెప్తున్నారు. కేసీఆర్ ప్రగల్భాల్లో ఆయన కృషి ఎంత ఉందనేది చూస్తే చాలా తక్కువే అని చెప్పాలి.

కేసీఆర్ పాలనలో పవర్ ప్లాంట్స్ ఎన్ని? అది ఉత్పత్తి చేసే కరెంట్ ఎంత? రోజు తెలంగాణలో కరెంట్ వినియోగం ఎంత? మిగతా కరెంట్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కట్టినవి రెండే విద్యుత్ ప్లాంట్స్. మొదటిది.. పాల్వంచ కేటీపీఎస్ ఏడవ దశ 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్. రెండవది బీటీపీఎస్ 1080 మెగావాట్ల థర్మల్ ప్లాంట్. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. అంటే కేసీఆర్ పాలనలో విద్యుత్ ఉత్పతయ్యే ప్లాంట్స్ రెండు. వాటినుంచి 1880 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరి12 వేల మెగావాట్ల కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది. కేసీఆర్ కంటే ముందు ఎవరు కట్టారు?

కాంగ్రెస్​ పాలనలో..

నాటి కాంగ్రెస్ పాలనలో మూడు ప్రధాన పవర్ ప్లాంట్స్ నిర్మాణం జరిగింది. పాల్వంచ కేటీపీఎస్, భూపాలపల్లి కేటీపీఎస్, రామగుండం ఎన్టీపీసీ. ఇవి థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే ఇక హైడల్ ప్రాజెక్టులూ ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైడల్​ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మితమైనవే. నేటి విద్యుత్ ​వెలుగుల వెనుక నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పునాదులు ఉన్నాయి. కానీ కేసీఆర్ మాత్రం తానే కరెంట్ తయారు చేసినట్టు, తన హయాంలోనే మొత్తం జనరేట్ చేస్తున్నట్టు అసత్యపు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ పాలనలో కట్టిన పాల్వంచ కేటీపీఎస్ ఏడోదశ 800 మెగా వాట్ల ప్లాంటు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం జరిగింది.

కేటీపీఎస్ ఏడో దశలో నాణ్యత లేకుండా నిర్మాణం చేస్తే 2018 డిసెంబరు నాటినుంచి నేటికి అయిదు సార్లు సుమారు 9 నెలల పాటు విడతల వారీగా షట్ డౌన్ అయిన మాట నిజం కాదా? కాంగ్రెస్ కట్టిన పవర్ ప్లాంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నేటికీ వెలుగులు అందిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కట్టిన రెండు ప్లాంట్స్ పై కూడా అవినీతి ఆరోపణలొచ్చాయి. మరోవైపు వ్యవసాయానికి 24 గంటల పేరుతో డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా, వేల కోట్లు బకాయిలు పెట్టి కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పవర్ ప్లాంట్స్ ఇన్ స్టాల్ కెపాసిటీ చూసుకుంటే.. పాల్వంచ కేటీపీఎస్ 2460 మెగా వాట్లు, చేల్పూరు కాకతీయ 1100 మె.వా, రామగుండం ఎన్టీపీసీ 2600 మె.వా, హైడల్ ప్రాజెక్టుల్లో శ్రీశైలం 900 మెగావాట్లు, నాగార్జున సాగర్ 8815 మెగావాట్లు కాగా, కేసీఆర్ పాలనలో పవర్ ప్లాంట్స్ చూస్తే.. బీటీఎస్ 1080 మెగావాట్లు, కేటీపీఎస్ ఏడో దశ 800 మెగావాట్లు, సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్​లో 1200 మెగావాట్లు. అయితే ఈ ప్లాంటును రాష్ట్ర ప్రభుత్వానికి క్లెయిమ్ చేయలేం. ఇది సింగరేణి ఆస్తిగా భావించాలి. ఇకపోతే యాదాద్రి 4 వేల మెగావాట్లు నిర్మాణంలో ఉన్నది. 

అప్పుల ఊబిలోకి డిస్కంలు

కాంగ్రెస్ పాలనలో నిర్మితమైన పవర్ ప్లాంట్లు నేటి తెలంగాణలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతుంటే, కేసీఆర్ పాలనలో రెండు ప్లాంట్లే కట్టినా అవీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దీనికే విద్యుత్ విజయోత్సవాలంటూ తెలంగాణ సమాజంపై అబద్ధపు చీకట్లు ఆవరించేలా మైమరపిస్తున్నది సర్కారు. మరోవైపు 24 గంటల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి విద్యుత్​కొనుగోలు చేస్తున్నది. నార్త్, సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సరికి ప్రభుత్వం డిస్కంలకు రూ. 2280 కోట్ల బకాయిలుంటే ఇప్పుడది పాతిక వేల కోట్లకు పైగా పెరిగింది. విద్యుత్​ వెలుగులంటే.. డిస్కంలను అప్పుల ఊబిలోకి నెట్టడమేనా? 



బి. వేణుగోపాల్​ రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్