గర్భిణికి హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్టు.. ఖమ్మం జిల్లాలో ఘటన

గర్భిణికి హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్టు.. ఖమ్మం జిల్లాలో ఘటన

పెనుబల్లి, వెలుగు: ఓ గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ ఉందంటూ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు  తెలిపిన ప్రకారం.. పెనుబల్లి మండలం అడవి మల్లెలకు చెందిన దంపతులు వీఎం బంజరలో ఉంటున్నారు.  వీరికి నాలుగేండ్ల కింద పెండ్లి అవగా తొలిసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఏడో నెల.

కాగా.. జనరల్ చెకప్ కోసం బుధవారం స్థానిక ఆశ కార్యకర్తను సంప్రదించగా పెనుబల్లిలోని సీహెచ్ సీకి తీసుకెళ్లింది. అక్కడ గర్భిణికి స్కానింగ్ తో పాటు బ్లడ్, హెచ్ఐవీ టెస్ట్ చేశారు. అయితే.. హెచ్ఐవీ టెస్ట్ పాజిటివ్ రావడంతో డ్యూటీ డాక్టర్లు వెంటనే ఆమెను బయటకు పంపారు. ఏమైందని ఆమె ఎంత అడిగినా ఎవరూ ఏం చెప్పలేదు. భర్త ఏం చేస్తడని వివరాలు అడగగా లారీ డ్రైవర్ అని చెప్పింది. వెంటనే ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి వెళ్లాలని పంపించారు. 

ఇంటికి వెళ్లి జరిగిన విషయం భర్తకు చెప్పింది. అతను తెలిసిన వారిని రిపోర్ట్ చూపించగా.. హెచ్ఐవీ పాజిటివ్ ఉందని చెప్పగా దంపతులు భయాందోళన చెందారు. బంధువులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చి ధైర్యం చెప్పి కల్లూరులోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో దంపతులకు మళ్లీ టెస్ట్ లు చేయించగా నెగెటివ్ వచ్చింది. ఇంకోసారి లంకాసాగర్ పీహెచ్ సీ లో కూడా చేయించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో గురువారం పెనుబల్లి సీహెచ్ సీకి వెళ్లి వైద్య సిబ్బందిని ప్రశ్నించగా తప్పు అయిందని, ఇంకోసారి ఇలా జరగనివ్వమని క్షమించాలని బతిమిలాడారు. వైద్య సిబ్బంది తప్పుడు రిపోర్ట్ తో చాలా భయపడ్డామని, బంధువులు సపోర్ట్ చేయకపోతే చనిపోయేవాళ్లమని దంపతులు వాపోయారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన సీహెచ్ సీ వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని దంపతులు డిమాండ్ చేశారు.