కరోనా.. బంధాలను తెంచుతుంది
తల్లికి వైరస్ వచ్చేందేమోనని.. కనీసం పలకరించని కూతురు
తండ్రి చివరిచూపులకూ నోచుకోని కొడుకు
వైరస్ సోకిన కుటుంబాలను దూరంగా పెడుతున్న బంధువులు
సిటీ నుంచి వచ్చిన అమ్మను ఇంటికి రానివ్వని కొడుకు.. తండ్రి దగ్గరికి వెళ్లి పలకరించడానికి భయపడుతున్న కూతురు.. నానమ్మని ఇంటికి తీసుకుపోలేని మనవళ్లు.. ఓ కుటుంబాన్ని వెలేసినంత పని చేసిన బంధువులు.. అన్న చనిపోతే అంత్యక్రియలకు వెళ్లలేని తమ్ముడు.. ఒక్కటా రెండా.. గుండె గుండెకో బాధ.. అడుగు అడుగుకో వ్యథ.. కరోనా తెచ్చిన కష్టమిది.. నాటి ’సామాజిక దూరాన్ని‘ గుర్తు చేస్తోంది. ముందు ఫిజికల్ గా.. తర్వాత మానసికంగా దూరం చేస్తోంది. మనుషులనే కాదు.. మనసులనూ చంపుతోంది. మానవత్వానికి సమాధి కడుతోంది.
తండ్రి ఇక్కడ.. బిడ్డ అమెరికాలో..
మలక్‌పేటకు చెందిన 65 ఏళ్ల శ్రీనివాస్ (పేరు మార్చాం) జ్వరంతో ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. కొన్ని పరీక్షలు చేసి కరోనా వార్డులో చేరమని డాక్టర్లు సూచించారు. అది ఇష్టం లేని ఆయన తనకేమీ కాలేదంటూ ఇంటికి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే రాత్రికి రాత్రి గాంధీకి తరలించారు. మరుసటి రోజు తెల్లవారు జామున శ్రీనివాస్ చనిపోయారు. కొడుకు అమెరికాలో ఉంటాడు. సిటీలో బోలెడు మంది బంధువులున్నారు. కానీ ఆయన శవాన్ని తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరి చూపులు చూసేందుకు కూడా ఎవరూ పోలేదు. అమెరికాలో ఉండే కొడుకు.. కనీసం తండ్రి చివరి ఫొటోలు పంపమన్నా బంధువులు సాయం చేయలేదు. దాంతో డాక్టర్లే ఫొటోలు తీసి ఆయనకు వాట్సప్ చేశారు. శవాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఖననం చేశారు.
బిడ్డ పట్టించుకోలే..
తార్నాక ప్రాంతంలో నివసించే లక్ష్మి (58) భర్త కరోనాతో చనిపోయారు. అయినా ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు. టెస్టులు చేయమని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు భర్త కరోనాతో చనిపోయాడని తెలవగానే బంధువులంతా ఇంటికి దూరమయ్యారు. సిటీలో ఉండే కన్న కూతురు కూడా తల్లిని పరామర్శించేందుకు రాలేదు. తనకు చిన్న పిల్లలున్నారని రాలేనని తెగేసి చెప్పింది. దీంతో ఒకవైపు భర్తను కోల్పోయి, మరోవైపు కన్న కూతురు పలకరించక, బంధువుల ఊరడింపుకూ నోచుకోలేక తన ఇంట్లోనే ఒంటరిగా కుమిలిపోతున్నది.
వైరస్ ను గెలిచింది.. కానీ..
హైదరాబాద్ లోని మరో ప్రాంతానికి చెందిన 93 ఏళ్ల పెద్దావిడ కరోనాతో పోరాడి గెలిచింది. టెస్టులో నెగెటివ్ వచ్చింది. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు.. పెద్దావిడ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమెను తీసుకెళ్లమని చెబితే వారు నిరాకరించారు. ఇంట్లో ఉంచుకోవడం కష్టం, కొద్ది రోజులు హాస్పిటల్‌లోనే పెట్టుకోమని చెప్పారు. అప్పటికే ఆ పెద్దావిడ కుమారుడు కరోనాతో చనిపోవడం, ఇద్దరు మనవళ్లకు పాజిటివ్ రావడమే కారణం. వాళ్లు హోం క్వారెంటైన్ అయ్యారు. ఇంట్లో పెద్దావిడను ఐసోలేషన్‌లో ఉంచడానికి సౌకర్యం లేదు. దాంతో అమెరికాలో ఉండే మనువరాలు డాక్టర్లకు ఫోన్ చేసి తాము ఏదో ఒక ఏర్పాటు చేసుకొనే వరకు నాలుగైదు రోజులు హాస్పిటల్‌లోనే ఉంచుకోమని డాక్టర్లను కోరాల్సి వచ్చింది.
ఇంకా ఎన్నెన్నో..
కరోనా కేసులు బాగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చిందనే అనుమానంతో తల్లిని కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు. కాలనీలో ఒకరికి కరోనా సోకిందని తెలియగానే జనమంతా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఊర్లలో ఒకరికి కరోనా సోకగానే బంధువులంతా ఆ కుటుంబాన్ని వెలేస్తున్నారు. ఏదైనా సిటీ నుంచి ఎవరైనా వస్తే ఊర్లలోకి రానివ్వట్లే. ఊరిబయటే అడ్డుకుంటున్నారు.
ఎన్నో కారణాలు
కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. చాలా మంది ఒకట్రెండు గదులున్న ఇళ్లలోనే ఉంటారు. ఇలాంటి కుటుంబాల్లో పాజిటివ్ వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉండడం సాధ్యం కావడం లేదు. కొన్ని ఇళ్లల్లో బాత్రూంల కొరత కూడా ఉంటోంది. దీంతో ఐసోలేషన్‌కు సమస్యగా మారుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇంట్లో అందరికీ కరోనా సోకుతుందనే కారణంతో.. సొంత మనుషులను కూడా దూరంగా పెట్టాల్సి వస్తోంది. కరోనా వల్ల చనిపోయిన వాళ్లలో వైరస్ కొద్ది రోజుల పాటు బతికే ఉంటుందన్న కారణంతో.. చాలా మంది అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రావట్లేదు. దీంతో బల్దియా సిబ్బందితోనే అంత్యక్రియలు జరిపిస్తున్నారు.
For More News..