రోడ్డున పడ్డ అమరుడి కుటుంబం

  •     రాష్ట్రం వచ్చాక అండగా ఉంటామని​ హామీ  
  •     ఆ తర్వాత తొంగిచూడని టీఆర్ ఎస్​ అధినేత
  •      బతుకు భారంగా మారిందని అమరుడి భార్య కన్నీళ్లు

నిజామాబాద్​, వెలుగు:  తెలంగాణ కోసం మంటల్లో ఆహుతైన అమరుడి కుటుంబం ఆదుకునేవారులేక రోడ్డున పడింది. అమరుడి కుటుంబానికి అండగా ఉంటానని అతని అంత్యక్రియలకు స్వయంగా హాజరై హామీ ఇచ్చిన కేసీఆర్​ ఇప్పటివరకు వారిని కన్నెత్తికూడా చూడలేదు. కులవృత్తి చేసుకుంటూ.. బీడీలు చుడుతూ ఇంతకాలం సంసారాన్ని నెట్టుకొచ్చిన అమరుడి భార్య ఇప్పుడు పూట గడవడం కూడా కష్టం కావడంతో తమను ఆదుకోవాలని కోరుతోంది. దశాబ్ది వేడుకల్లో బిజీగా ఉన్న ఆఫీసర్లకు తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాల గోస వినే తీరికలేకుండా పోయిందని బాధితురాలు వాపోతోంది.  

సిరికొండకు చెందిన  అల్లపురం శ్రీనివాస్​కు తెలంగాణ అంటే పిచ్చి. సిరికొండలోనే 7వ తరగతివరకు చదువుకున్న శ్రీనివాస్​ తన కులవృత్తి అయిన చాకలి పని చేసుకునేవాడు. అమ్మానాన్న, ఇద్దరు తోబుట్టువులు, భార్య, మూడేళ్ల బాబుతో కలిసి ఉండేవాడు. అయన చనిపోయే నాటికి భార్య సునీత గర్భిణి. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కలలు కనేవాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో గ్రామంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడు. తాజా పరిణామాలను  ఎప్పటికప్పడు తెలుసుకుంటుండే శ్రీనివాస్  కేంద్రం రాష్ట్రప్రకటన చేసి యూ టర్న్​ తీసుకోవడంతో  రగిలిపోయాడు. ఈ విషయం మీద భార్యసునీతతో  తన ఆక్రోశాన్ని  పంచుకునేవాడు. చిన్న ప్రాణానికి ఇవన్నీ ఎందుకని భార్య  అన్నా వినలేదు. కులవృత్తిని కూడా మాని ఉద్యమబాట పట్టాడు.

2010 జులైలో అతని తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత 20 రోజులకు రెండు నెలల గర్భిణి అయిన భార్యను, మూడేళ్ల కొడుకు నవదీప్​ను ఆమె తల్లిగారింటికి పంపాడు. తెలంగాణ ఆకాంక్షను ప్రకటించడానికి  జులై 24న కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం గాయాలైన అతన్ని నిజామాబాద్​కు తరలించగా.. పరిస్థితి సీరియస్​గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని ఉద్యమనేతలు హైదరాబాద్​లోని కార్పొరేట్​ హాస్పిటల్​ తరలించారు. హాస్పిటల్​లో  చికిత్స పొందుతున్న సమయంలోనూ తెలంగాణ కావాలంటూ నినదించాడు. మహారాష్ట్ర మాజీ గవర్నర్​విద్యాసాగర్​రావు​, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అతన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కూడా తెలంగాణ గురించే కలవరించాడు. రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన శ్రీనివాస్​26న సాయంత్రం చనిపోయాడు.   

దారి చూపండంటూ వేడుకోలు

శ్రీనివాస్​ను  అమరవీరుడిగా గుర్తించిన స్థానిక ప్రైవేటు స్కూలు యాజమాన్యం ఆతని  కొడుకు నవదీప్​కు  టెన్త్​వరకు ఉచితంగా చదివించింది.  కూతురు శ్రీజ, ముసలిదైన  అత్త, చెవులు వినబడని  ఒక ఆడబిడ్డ, విడాకులు తీసుకున్న మరో  ఆడబిడ్డ.. వీరందరి భారం  సునీత మీదే పడింది.  చాకలి పని చేస్తూనే  కూతురితో  కలిసి బీడీలు చుడుతూ సునీత కుటుంబాన్ని పోషించుకుంటూవస్తోంది. ఇద్దరి కష్టంతో కుటుంబాన్ని  సాదడం భారం కావడంతో తనకు ఏదన్నా దారి చూపాలని సునీత కోరుతోంది.  దశాబ్ది వేడుకల సందర్భంగానైనా   కరుణించాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ తన గోడు వినడంలేదని సునీత వాపోతోంది.    

ఓదార్చి వెళ్లిపోయారు...

శ్రీనివాస్​మృతదేహాన్ని జేఏసీ నేతలు  సిరికొండకు తరలించగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నినాదాలతో సిరికొండ దద్ధరిల్లింది.  టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ స్వయంగా సిరికొండకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  శ్రీనివాస్​ త్యాగాన్ని కొనియాడిన కేసీఆర్ .. ​అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా శ్రీనివాస్​ భార్యను,   కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా  భరోసా ఇచ్చారు. కానీ ఆతర్వాత ఎవరూ వారిని పట్టించుకోలేదు.