రూ.4 లక్షలిచ్చి కోటి విలువ చేసే ఇల్లు బ్యాంకులో తాకట్టు

రూ.4 లక్షలిచ్చి కోటి విలువ చేసే ఇల్లు బ్యాంకులో తాకట్టు
  • ఇంటి ఓనర్​కు తెల్వకుండా లోన్ తీసుకున్న దళారి  
  • ఈఎంఐ కట్టకపోవడంతో జప్తుకు వచ్చిన బ్యాంక్ ఆఫీసర్లు 
  • ఒంటిపై డీజిల్‌‌ పోసుకునికుటుంబం ఆత్మహత్యాయత్నం 
  • బేగంపేట్‌‌ ప్రకాశ్‌‌నగర్‌‌‌‌లో  ఘటన 

హైదరాబాద్‌‌, వెలుగు: రూ.కోటి విలువ చేసే ఇంటిని తమకు తెలియకుండా ఓ బ్రోకర్ బ్యాంకులో తాకట్టు పెట్టాడని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంటిని జప్తు చేసేందుకు వచ్చిన బ్యాంకు అధికారుల ముందే ఒంటిపై డీజిల్‌‌ పోసుకున్నారు. బేగంపేట్‌‌ ప్రకాశ్‌‌నగర్‌‌‌‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశ్‌‌నగర్‌‌‌‌కు చెందిన భూషణ్..​కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అనసూయ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవల కూతురికి పెండ్లి నిశ్చయమైంది. పెండ్లికి అవసరమైన డబ్బు కోసం దినకర్ అనే ఓ బ్రోకర్ ను  భూషణ్ కలిశాడు.

ఓ ప్రైవేట్‌‌ ఫైనాన్సియర్ వద్ద లోన్​ఇప్పిస్తానని భూషణ్ ను దినకర్ నమ్మించాడు. తన భార్య రజినీకి ఇంటిని అమ్మినట్టు భూషణ్ చేత పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు.పెండ్లి కోసం భూషణ్​కుటుంబానికి రూ.4 లక్షల వరకు ఇచ్చాడు. భూషణ్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్‌‌ను హైదర్‌‌‌‌గూడలోని మహారాష్ట్ర బ్యాంక్‌‌లో దినకర్ మార్టిగేజ్‌‌ చేసి రూ.కోటి తీసుకున్నాడు. రూ.35 లక్షలు మాత్రమే లోన్ తీసుకున్నట్టు భూషణ్​కుటుంబానికి చెప్పాడు. దినకర్ ఈఎంఐలు కరెక్ట్ గా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు భూషణ్​ఇంటిని జప్తు చేసేందుకు మంగళవారం వచ్చారు.

తమ ఇంటిని జప్తు చేయవద్దని భూషణ్ వేడుకున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో భూషణ్, అతని భార్య అనసూయ, వారి కొడుకు ఒంటిపై డీజిల్​పోసుకుని నిప్పంటించుకోబోయారు. స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థాలానికి చేరుకున్న బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుల తరఫు అడ్వకేట్ తో కలిసి బ్యాంక్ కు వెళ్లి అధికారులతో  మాట్లాడారు.