‘ఆధార్’లో వెతికినా ఆ ఇద్దరు పిల్లల కుటుంబ వివరాలు దొరకలే

  • కొత్తగా నమోదు చేయించిన డీసీపీఓ
  • స్టేట్​హోం లేదా ప్రజ్వల హోంకు తరలించే అవకాశం 
  • దత్తత ఇవ్వడానికి కేరింగ్స్​లో డేటా నమోదు చేసే చాన్స్​ 

యాదాద్రి, వెలుగు : పదేండ్ల క్రితం వ్యభిచార ముఠా కొన్న ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించగా, వారికి సంబంధించిన వివరాలను యాదాద్రి జిల్లా చైల్డ్ ​ప్రొటెక్షన్ ​డిపార్ట్​మెంట్​ తెలుసుకోలేకపోయింది. వారి తల్లిదండ్రుల వివరాలతో పాటు ఎక్కడి వారో తెలుసుకోవడానికి చిన్నారుల వేలిముద్రల ఆధారంగా ఆధార్​కార్డులో వివరాల కోసం ప్రయత్నించి విఫలమైంది. చిన్నతనంలో తల్లిదండ్రులు ఆధార్​ నమోదు చేయించకపోవడంతో కుటుంబ వివరాలు లభ్యం కాలేదని చెప్పారు.  

ఏమీ చెప్పలేకపోతున్న పిల్లలు

యాదాద్రి జిల్లా యాదగిరిపల్లికి చెందిన వ్యభిచార ముఠా ఐదేండ్లున్న ఇద్దరు చిన్నారులను పదేండ్ల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో కొనుగోలు చేసింది. పెంచి పెద్ద చేసి మూడేండ్ల కింద వ్యభిచార కూపంలోకి దింపారు. చిత్రహింసలు పెట్టడంతో ఓ చిన్నారి పారిపోతూ జనగామ జిల్లా పోలీసులకు దొరికింది. తర్వాత చైల్డ్​ ప్రొటెక్షన్​ డిపార్ట్​మెంట్​చొరవతో యాదాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసి మరో చిన్నారికి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. వీరి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోవడానికి చైల్డ్​ ప్రొటెక్షన్​డిపార్ట్​మెంట్, పోలీసులు కలిసి పిల్లలను అడిగినా ఏమీ చెప్పలేకపోయారు. ఐదేండ్ల వయస్సులోనే వ్యభిచార ముఠా చేతుల్లో చిక్కినందున అప్పటి విషయాలు గుర్తు లేవని చెప్పారు. ఒక చిన్నారి నవీన మాత్రం తన తల్లి, తండ్రి పేరు చెప్పడంతో పాటు తండ్రి తాగొచ్చి తరచూ తల్లిని కొట్టేవాడని చెప్పింది. తర్వాత తల్లిదండ్రులు విడిపోవడంతో తనను ఇక్కడికి తీసుకొచ్చారని తెలిపింది. 

హైదరాబాద్ ఆధార్ ​ సెంటర్​కు.. 

పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత యాదాద్రి జిల్లా ఆఫీసర్లు వారిని సఖీ సెంటర్​లో చేర్చారు. తర్వాత హైదరాబాద్​లోని ఆధార్​నమోదు సెంటర్​ కు తీసుకెళ్లారు. ఇద్దరి వేలి ముద్రలు, కనుపాపలతో ఆధార్​కార్డు ఉందా? అన్న కోణంలో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఒక పాప ఆధార్​ నమోదై ఉన్నప్పటికీ ఆ కార్డును యాదగిరిపల్లిలోని వ్యభిచార ముఠా తీయించినట్టు తేలింది. గార్డియన్​గా కంసాని అనసూర్య పేరు ఉంది. మరో బాలిక కు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో ఈమెకు కొత్తగా ఆధార్​ కార్డు నమోదు చేయించారు. చిన్నతనంలో వారి తల్లితండ్రులు ఆధార్​నమోదు చేయించక పోవడం వల్లే ఎలాంటి డేటా లభ్యం కాలేదని అధికారులు చెప్పారు.  

కేరింగ్స్​లో చిన్నారుల డేటా

పిల్లలను హైదరాబాద్​లోని స్టేట్​ హోం లేదా ఆమనగల్లులోని 'ప్రజ్వల' హోంకు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడే వారి చదువు సాగనుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే వారి గురించి మీడియాలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా చిన్నారుల కుటుంబాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఈ ప్రయత్నంలోనూ విఫలమైతే చిన్నారులను దత్తత ఇవ్వడానికి వీలుగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్​సైట్​​ చైల్డ్​అడాప్షన్ రిసోర్స్​ఇన్ఫర్మేషన్​అండ్​గార్డియన్స్​సిస్టమ్​(కేరింగ్​)లో చిన్నారుల వివరాలను నమోదు చేస్తామన్నారు. సదరు వెబ్​సైట్​లో ఎవరైనా అప్లై చేసుకుంటే దత్తత ఇస్తామని, లేకపోతే వారి చదువు, పోషణ చూసుకుంటామన్నారు.