- కుటుంబ కలహాలు, ఆన్లైన్ బెట్టింగ్స్ కారణం
- కామారెడ్డిలోని నందివాడలో దారుణం
- బావిలో దొరికిన ముగ్గురి మృతదేహాలు
తాడ్వాయి, వెలుగు: కుటుంబ కలహాలు, ఆన్లైన్ బెట్టింగ్స్‌కు ముగ్గురు బలయ్యారు. ఇద్దరు కొడుకులను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత తానూ అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో జరిగింది. నందివాడకు చెందిన చిట్యాపు గుండారెడ్డి చిన్న కూతురు అపర్ణకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నయాగాం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో పదేండ్ల కింద పెండ్లి చేశారు. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు విఘ్నేశ్ (6), అనిరుధ్ (4) ఉన్నారు. అయితే కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తనకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ కోపంగా ఉన్నాడు. దీనికి తోడు ఇటీవల అన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు తనను అత్తగారింట్లో సరిగా చూడడం లేదని శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నాడు.
జంబీ కోసమని వెళ్లి..
శనివారం దసరా రోజు జంబీ కోసం వెళ్తున్నామని ఇంట్లో చెప్పి, తన ఇద్దరు కొడుకులను తీసుకుని శ్రీనివాస్ బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసినా ఆచూకీ దొరకలేదు. అనుమానం వచ్చి ఆదివారం ఉదయం పొలం దగ్గరున్న బావి వద్దకు వెళ్లి చూడగా.. ఇద్దరు పిల్లల శవాలు తేలుతూ కనిపించాయి. వెంటనే తాడ్వాయి పోలీసులకు సమాచారం అందించగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, కామారెడ్డి సీఐ రామన్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు స్పాట్‌కు వెళ్లి పరిశీలించారు. బావి పక్కనే శ్రీనివాస్ ఫోన్, చెప్పులు ఉండడంతో అతను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించిన పోలీసులు.. మోటార్లతో బావిలోని నీటిని తోడేశారు. అప్పుడు శ్రీనివాస్ మృతదేహం కూడా కనిపించింది. ముగ్గురి శవాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ భార్య అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.