వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఫ్యామిలీ బలి

వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఫ్యామిలీ బలి
  • బాసర వద్ద గోదావరిలో  దూకి సూసైడ్​ అటెంప్ట్​
  • భర్త మృతి, కూతురు గల్లంతు
  • భార్యను రక్షించిన జాలర్లు
  • ఇటీవలే కూతురి పెండ్లి ఫిక్స్

బాసర/నిజామాబాద్​,  వెలుగు: వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పు, వడ్డీతో సహా ముట్టజెప్పినా చక్రవడ్డీ కోసం అవమానకరంగా మాట్లాడుతుండడంతో భరించలేని ఇందూరు నగరానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోడానికి బాసర వద్ద గోదావరిలో దూకేసింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో భర్త వేణు(54) చనిపోగా, కూతురు పూర్ణిమ(25) గల్లంతైంది. జాలర్లు భార్య అనురాధ(50) ప్రాణాలతో బయటకుతీశారు. 

బాధితురాలు అనురాధ పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని పులాంగ్​ ఏరియాలో పాన్​ మసాలా షాప్​ నిర్వహించే వేణు, అనురాధ దంపతులు 20 ఏండ్ల కింద యాదాద్రి జిల్లా నుంచి వలస వచ్చి న్యాల్​కల్​ రోడ్డులోని రాజరాజేంద్ర చౌరస్తా సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి కూతురు పూర్ణిమ ఉండగా, ఆమెకు ఈ మధ్యే పెండ్లి కుదిరింది. బిజినెస్​ డెవలప్​ చేసుకోడానికి వేణు నగరానికి చెందిన రోషన్​లాల్, వికాస్​లాల్​ వద్ద ఏడాది కింద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అసలు వడ్డీ కలిపి రూ.4 లక్షల దాకా కట్టేయగా, చక్రవడ్డీ చెల్లించాలని వేధింపులు మొదలుపెట్టారు. ఇంటికి  ప్రతిరోజూ వచ్చి అవమానకరంగా మాట్లాడడం, భార్య, కూతురుని నగ్నంగా ఊరేగిస్తామని బెదిరించడంతో భయపడి అంతా కలిసి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడయ్యారు. బుధవారం ఉదయం ముగ్గురూ కలిసి స్కూటీపై నిజామాబాద్​లోని ఇంటి నుంచి బాసర వెళ్లి అక్కడ ఘాట్​ నంబర్–1లో ఒకేసారి దూకేశారు. 

సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి అనురాధను రక్షించగా, కొద్దిసేపటికి వేణు డెడ్​బాడీ దొరికింది. పూర్ణిమ జాడ ఇంకా తెలియలేదు. గజఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాసర సీఐ మల్లేశ్, ఎస్ఐ గణేశ్​​ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేణు డెడ్​బాడీని భైంసా గవర్నమెంట్​ హాస్పిటల్​కు షిఫ్ట్​ చేశారు. అనురాధకు అక్కడే ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు.