జగిత్యాలలో వారసులు రెఢీ.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సీట్ పై సంజయ్​ కన్ను

  • జీవన్ రెడ్డి సపోర్ట్​ ఇవ్వకపోవడంపై రామచంద్రారెడ్డి గుస్సా
  • రత్నాకర్ రావు స్థానం భర్తీకి కుమారుల తండ్లాట
  • పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్న  కొమిరెడ్డి  వారసుడు

జగిత్యాల, వెలుగు : జిల్లాలో వివిధ పార్టీల్లో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు కుటుంబ వారసులు రెడీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ  చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయా నియోజక వర్గల్లో అన్నీ తామై పార్టీ కార్యక్రమాలను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఎవరి వారసులు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్  రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. 

ఈసారి కోరుట్లలో తానే పోటీలో ఉంటానన్నట్లుగా సంజయ్ సంకేతాలిస్తుండడమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మినిస్టర్ రత్నాకర్ రావు కొడుకులు జువ్వాడి నర్సింగారావు, క్రిష్ణారావు వారి తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రజా క్షేత్రం లో పోరాటం మొదలు పెట్టారు. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయాల్లో తమను పరిచయం చేయకపోవడంపై వారసులు గుస్సా అవుతున్నట్లు వినిపిస్తుంది. ఇలా  జిల్లా రాజకీయాల్లో లో బీజేపీ  మినహా బీఆర్ఎస్, కాంగ్రెస్ లో వారసుల వారసత్వం పట్ల రాజకీయ వర్గాలల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 

తండ్రి సీట్ పై వారసుడి నజర్​ 

కోరుట్లలో తన కొడుకు సంజయ్ ను బరిలోకి దించడానికి   ఎమ్మెల్యే  విద్యా సాగర్ రావు ఎంకరేజ్ చేస్తున్నారంటూ కొడుకు సన్నిహిత వర్గం ప్రచారం చేస్తోంది. తానే పోటీలో లో ఉండాలని విద్యాసాగర్ అనుకుంటున్నా.. కొడుకే కార్నర్ చేస్తున్నాడంటూ ఎమ్మెల్యే అనుచర వర్గం చెబుతోంది.  బీఆర్ఎస్ కేడర్ కు క్లారిటీ ఇచ్చేందుకు ఇటీవల జరిగిన మీటింగ్ లలో తాను పోటీ చేయట్లేదనీ, తన కొడుకుకే సపోర్ట్ చేయాలని ఆయన ప్రకటించారు. వరుసగా నాలుగుసార్లు  ఎమ్మెల్యేగా గెలిచిన విద్యాసాగర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీతో సత్సంబంధాలున్నాయి.  కేటీఆర్ కు సంజయ్ క్లాస్ మేట్ కావడంతో మంచి దోస్తీ కూడా ఉంది. అయితే  సంజయ్ కు కేటీఆరే సపోర్ట్ చేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యే విద్యా సాగర్ రావును ఐదోసారి కూడా బరిలో ఉండాలని సూచించినట్లు సన్నిహితులు చెపుతున్న మాట. టికెట్ కేటాయింపుతోనే ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ లో వారసత్వం కోసం తండ్లాట 

మాజీ మంత్రి,కాంగ్రెస్​ లీడర్​ జువ్వాడి రత్నాకర్ రావు కొడుకులు జువ్వాడి క్రిష్ణారావు, నర్సింగా రావు  ఇప్పటికే యాక్టివ్ పాలిటిక్స్ లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో  కోరుట్ల  నుంచి కాంగ్రెస్ టికెట్ పై నర్సింగా రావు పోటీ చేసి  సుమారు 10 వేల ఓట్ల తేడా తో ఓడిపాయారు. ఈ సారి ఎలాగైనా గెలిచి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.  అలాగే మూడు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ముగ్గురు కొడుకులున్నా ఆయన స్థానాన్ని భర్తీ చేసేలా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరని తెలుస్తోంది. ఆయన పెద్ద కొడుకు రాంచంద్రా రెడ్డి మాత్రం కాంగ్రెస్ క్యాడర్ కు సుపరిచితుడైప్పటికీ జనాల్లో గుర్తింపు పొందలేక పోయారు.   పాలిటిక్స్ లో  కేటీఆర్, కవిత యాక్టివ్  గా ఉండడంతో సీఎం కేసీఆర్ అదృష్టవంతుడని ఇటీవల  ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి కొనియాడారు. దీంతో తండ్రిపై రాంచంద్ర రెడ్డి గుస్సా కావడంతో  ఆయనను క్యాడర్ బుజ్జగించే పనిలో పడ్డారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. తండ్రి ప్రోత్సహిస్తే రాంచంద్రా రెడ్డి యాక్టివ్  పాలిటిక్స్ చేస్తారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. అలాగే  మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కు ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ పెద్ద కొడుకు కొమిరెడ్డి కరం రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ తన తండ్రి క్యాడర్ ను సమీకరిస్తున్నారు.

బీజేపీలో వారసత్వం కలిసొచ్చేనా.. 

కోరుట్లకు చెందిన సురభి భూంరావు బీఆర్ఎస్  స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ కు సన్నిహితుడుగా కొనసాగారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం తో బీజేపీలో చేరి 2014 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి కోరిక నెరవెర్చాలని ఇటీవల బీజేపీలో చేరిన సురభి నవీన్ రావు  నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలతో చురుగ్గా ఉంటున్నారు. కింది స్థాయి క్యాడర్ ను, ముఖ్య లీడర్లను,  ఎమ్మెల్యే ఆశావాహులను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. టికెట్ కన్ఫర్మ్ కాగానే మరింత యాక్టివ్ అవుతారని బీజేపీ శ్రేణుల్లో టాక్​ నడుస్తోంది.