మిట్టపల్లిలో గ్యాస్ సిలిండర్ లీకై బాలుడు, వృద్ధురాలు మృతి

మిట్టపల్లిలో గ్యాస్ సిలిండర్ లీకై  బాలుడు, వృద్ధురాలు మృతి
  • మరో నలుగురి పరిస్థితి విషమం
  • ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన

తల్లాడ, వెలుగు: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరు మరణించారు. మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ కుమార్ ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్ అయిపోయింది. ఈ క్రమంలో కొత్త గ్యాస్ బండ తీసుకొచ్చి రెగ్యులేటర్ బిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ లో ఉన్న గ్యాస్ లీకైంది. అదే సమయంలో బయట కట్టెల పొయ్యి వెలుగుతుండటంతో క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి.

 ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వినోద్ కుమార్, అతడి తల్లి సుశీల, చిన్నారులు తరుణ్, వరుణ్, ప్రిన్సి, లింసీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ వృద్ధురాలు సుశీల, ఏడేండ్ల బాలుడు తరుణ్ మంగళవారం చనిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. దీనిని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
 
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే..

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వినోద్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.