- కుటుంబ తగాదాలతో హత్య, సహకరించిన ఫ్యామిలీ మెంబర్స్
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
మహబూబాబాద్, వెలుగు: కుటుంబ తగాదాలతో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందత్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సిగ్నల్ కాలనీకి చెందిన భూపతి అంజయ్య ఇంట్లో మూడేండ్లుగా పాటి లక్ష్మి రాములు దంపతులు, కుమారుడుకోడలు గోపి, నాగమణి (35), కూతురు అల్లుడు దుర్గా, మహేందర్ రెంట్‌కు ఉంటున్నారు.
వీరంతా ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ, కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. గోపి, నాగమణి మధ్య కొన్నేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. గోపి తనను పట్టించుకోవడం లేదంటూ నాగమణి రెండు నెలల కింద టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇద్దరి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తమ అత్త నాగమణిని కుటుంబ సభ్యులే చంపి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారని దుర్గ కుమార్తెలు మౌనిక, మానస ఇటీవల స్థానికులకు చెప్పారు.
రెండు రోజుల నుంచి కుటుంబసభ్యులెవరూ కనిపించకపోవడం, వీరి ఇంటి ఆవరణలోంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని పూడ్చిన స్థలాన్ని గుర్తించి డెడ్‌బాడీని వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా వివరాలను సేకరించామని, పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.