- మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి లీడర్ల ఆసక్తి
- కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై దృష్టి
- ఇంటింటికి తిరిగి వివరాల సేకరణ
- వివరాలు చెబితే తామే దరఖాస్తు చేస్తామని వెల్లడి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి విద్యానగర్ కాలనీలో కొన్నేళ్లుగా నివాసం ఉన్న ఓ ఫ్యామిలీ నాలుగేళ్ల క్రితం హౌసింగ్ బోర్డు కాలనీకి మారింది. వీరి ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం విద్యానగర్ కాలనీలో ఉన్నాయి. ఆ ఇంటి యాజమాని ఓటర్ చిరునామా మార్పు గురించి పట్టించుకోలేదు. ఎక్కడో ఒక చోట ఓటు ఉందని అనుకుంటున్నారు. ఇలా ఆలోచించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కాగా, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో హౌసింగ్‌బోర్డులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓ లీడర్ఆ నాలుగు ఓట్లు ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి చిరునామా మార్చుకోవాలని, మార్పులు, చేర్పులు ఉంటే తానే చూసుకుంటానని చెబుతున్నాడు.
ఇంటింటికి తిరిగి..
అశోక్ నగర్‌కాలనీలో ఓ లీడర్ తన వార్డులో ఇంటింటికి తిరుగుతూ కొత్త ఓటర్లను చేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఓటు హక్కులేని వారు తమ వివరాలు ఇస్తే తానే దరఖాస్తు చేస్తానని చెబుతున్నాడు. దేవునిపల్లి పరిధిలోని కొత్త కాలనీల్లో కూడా ఓ లీడర్ఇలా కొత్త ఓటర్ల ఎంట్రీ, మార్పులు, చేర్పుల కోసం ఇంటింటికి తిరుగుతున్నాడు.
ఎన్నికల హడావుడి షూరు
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారు ఓటర్ల లిస్టులో కొత్త ఓటర్లను చేర్చటం, మార్పులు, చేర్పులపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారు చేశారు. మరో ఐదు నెలల్లో మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగియనుంది. దీంతో మున్సిపాలిటీలలో ఎన్నికల హడావుడి షూరు అయ్యింది. ప్రస్తుత కౌన్సిలర్లు, కొత్తగా పోటీకి ఆసక్తి చూపుతున్న వారు ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓటర్ల దృష్టిలో పడేందుకు..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉన్నాయి. 1,04,267 మంది జనాభా , 72,361 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా వార్డుల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్న వారు వివిధ కార్యక్రమాల ద్వారా ఓటర్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఓటరు జాబితాపై సమ్మర్ రివిజన్ జరుగుతోంది. ఓటరు లిస్టులో పేర్లు ఉండి చనిపోయిన వారి పేర్లు తొలగిస్తున్నారు. అసలు ఓటుహక్కు లేని వారు కొత్తగా ఓటర్‌గా అప్లయ్ చేసుకోవటంతో పాటు, జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఇల్లు మారినా, టౌన్ మారినా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది.
దీంతో కొత్త ఓటర్ల చేరిక, మార్పులు, చేర్పులపై కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వాళ్లు దృష్టి పెట్టారు. తాము పోటీ చేయాలనుకున్న వార్డులో ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్ లిస్టులో పేరు లేని వారి వివరాలు తీసుకొని తామే అప్లయ్చేస్తామంటున్నారు. ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారినా, మరో కిరాయి ఇంటికి మారినా వారి ఇంటి అడ్రసుకి వెళ్లి మార్పులు, చేర్పులకు కూడా దరఖాస్తు చేస్తున్నారు.
ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త టౌన్లోని వార్డులు, దేవునిపల్లి పరిధిలోని వార్డుల్లో ఓటర్ల లిస్టుపై ఆశావహులు దృష్టిసారించారు. అశోక్‌నగర్, ఎన్జీవోస్కాలనీ, కాకతీయనగర్, విద్యానగర్, హౌసింగ్‌బోర్డు, శ్రీరాంనగర్, స్నేహపూరి కాలనీ, కల్కినగర్, విద్యుత్ నగర్, గాయత్రి నగర్ కాలనీల్లోని వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీకి చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆయా పార్టీల లీడర్లు, ఇండిపెండెంట్‌గా పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్న వాళ్లూ ఓటర్ల దృష్టిలో పడేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. కొన్ని సార్లు ఒకటి, రెండు ఓట్లతోనే ఫలితాలు తారుమారైనా సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఓటర్ల లిస్టులో ప్రతీ ఓటరు పేరు ఉండేలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు.