
సూపర్ హిట్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3 నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం (ఏప్రిల్ 27న) సాయంత్రం అస్సాంలోని గర్భంగ అడవిలోని జలపాతం సమీపంలో శవమై కనిపించాడు.
రోహిత్ తన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు జలపాతంలో పడిపోయాడని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, అతని శరీరంలో అనేక గాయాల గుర్తులు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. దాంతో రోహిత్ను ఎవరైనా చంపి జలపాతం ఒడ్డున పడేసినట్లు కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు.
రోహిత్ బాస్ఫోర్.. కొన్ని నెలల క్రితం ముంబై నుండి గౌహతికి తిరిగి వచ్చాడని సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్నేహితులతో విహారయాత్రకు ఇంటి నుండి బయలుదేరాడని అతని కుటుంబం పేర్కొంది. ఆ తర్వాత, రోహిత్ నుండి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని, అతని స్నేహితులలో ఒకరి నుండి రోహిత్ మరణించినట్లు కాల్ వచ్చినట్లు ఫ్యామిలీ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
హత్యగా అనుమానం:
నటుడు రోహిత్‌ను అతని నలుగురు స్నేహితులు కలిసి హత్య చేశారని ఆ కుటుంబం ఆరోపించినట్లు సమాచారం. ఇది పక్కా స్కెచ్ తోవేసిన మర్డర్ అని అతని ఫ్యామిలీ చెబుతుంది. ఇటీవలే ఓ పార్కింగ్ వివాదంలో రోహిత్ కు మరికొంత మంది వ్యక్తులకు గొడవ జరిగిందని, ఆ సమయంలో ముగ్గురు నిందితులు అతన్ని చంపేస్తామని బెదిరించారని వారు ఆరోపించారు.
ఆరోపణల్లో పేరున్న వారిలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్ మరియు ధరమ్ బాస్ఫోర్ ఉన్నారని ఫ్యామిలీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా.. అదనంగా, రోహిత్‌ను విహారయాత్రకు ఆహ్వానించిన అమర్‌దీప్ అనే జిమ్ యజమానిపై కూడా కుటుంబం ఆరోపణ చేసింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రోహిత్ "ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయాడని" సమాచారం. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు ఎవ్వరినీ అనుమానించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపగా.. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇకపోతే, గౌహతి పోలీసులు ప్రస్తుతం హత్య కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.