మిస్టరీ ఏంటీ: ఆ 27 ఏళ్ల మహిళా సింగర్‎ను విషం ఇచ్చి చంపారా..?

మిస్టరీ ఏంటీ: ఆ 27 ఏళ్ల మహిళా సింగర్‎ను విషం ఇచ్చి చంపారా..?

భువనేశ్వర్: ఒడిశా యువ సింగర్ రుక్సానా బానో మృతిపై మిస్టరీ నెలకొంది. ‘‘దిల్ కా అంగన్, పర్దేస్ మే హై సజాన్, తేరీ ఆంఖో మే హై జాదు’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‎తో గాయనిగా మంచి గుర్తింపు  తెచ్చుకున్న రుక్సానా బానో.. సెప్టెంబర్ 18వ తేదీన భువనేశ్వర్ ఎయిమ్స్‎లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఎంతో భవిష్యత్ ఉన్న రుక్సానా 27 ఏళ్ల వయసులోనే మృతి చెండడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రుక్సానా బానో మరణంపై ఆమె కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 

తన కూతురిది సహజ మరణం కాదని.. తన బిడ్డపై విష ప్రయోగం జరిగిందని రుక్సానా తల్లి సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేసింది. ఆమె తోటి ప్రత్యర్థులే స్లో పాయిజనింగ్ బారిన పడి మరణించేలా కుట్ర చేశారని ఆరోపించింది. అయితే, తన కూతురిపై విష ప్రయోగం చేశారని ఆరోపిస్తున్న ప్రత్యర్థి పేరును మాత్రం రుక్సానా తల్లి వెల్లడించలేదు. ఇదిలా ఉంటే, రుక్సానా మరణంపై ఆమె సోదరి రూబీ సైతం మీడియాతో మాట్లాడారు. 15 రోజుల క్రితం రుక్సానా బోలంగీర్‌లో జ్యూస్ తాగిన తర్వాత అస్వస్థతకు గురైందని.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని తెలిపింది.

 రుక్సానా ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యుల సూచనల మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్‎కు తరలించామని.. ఇక్కడే చికిత్స పొందుతూ సెప్టెంబర్ 18న మృతి చెందిందన్నారు. రుక్సానాపై విష ప్రయోగం చేశారని సోదరి మరణంపై రూబీ అనుమానం వ్యక్తం చేసింది. కాగా, రుక్సానాపై విష ప్రయోగం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రుక్సానాది సహజ మరణంగా భావిస్తోన్న పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు హత్య కోణంలో పోలీసులు  విచారణ చేపడతారా అనేది చర్చనీయాంశంగా మారింది.