ప్రణీత్ రావు సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాడు: కుటుంబ సభ్యులు

ప్రణీత్ రావు అరెస్ట్ ను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లోనే ప్రణీత్ రావు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రణీత్ రావు ను ఇంకా అరెస్టు చేయలేదన్న చెప్పారు పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందని.. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు పోలీసులు. ఇప్పటికే ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు పంజాగుట్ట ఇన్స్ పెక్టర్. ఆ తర్వాత అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఏం జరిగిందంటే..

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేస్తూ.. దాదాపు 30 మంది పోలీస్ సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేశారని  ప్రణీత్ రావు ఆరోపణలు ఉన్నాయి. 

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రికార్డులు, ఆధారాలను ధ్వంసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో పాటు డాక్యుమెంట్లను తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. ఎలక్ట్రిషియన్ సాయంతో సీసీటీవీలను ఆపేసి ఆధారాలను ధ్వంసం చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్ఐబీ సహా ఇతర కీలక విభాగాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుపై అంతర్గత విచారణ జరిపింది. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించి రూల్స్ అతిక్రమించినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.