కలెక్టర్ అని తెలియక దాడి చేసిన్రు:లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు

  • ఆ దాడిని సాకుగా చూపి.. పోలీసులు
  • మాపై దౌర్జన్యం చేశారు: లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు
  • ఢిల్లీలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలతో కలిసి మానవ హక్కులు, మహిళా,ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు
  • రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేస్తున్నడు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఫార్మా క్లస్టర్లకు భూములు ఇవ్వబోమని 9 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని.. అయినా తమను ఎవరూ పట్టించుకోలేదని లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన నిందితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ, ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్.. పోలీసు సెక్యూరిటీ లేకుండా రావడంతో.. ఆయన కలెక్టర్​అని తెలియక కొంతమంది పిల్లలు దాడి చేశారని చెప్పారు. ఆ దాడిని సాకుగా చూపించి అదే రోజు అర్ధరాత్రి 500 మంది పోలీసులు వచ్చి కరెంట్ బంద్ పెట్టి తమపై దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు.

 సోమవారం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి,‌‌‌‌‌‌‌‌ వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలోతు కవిత, పలువురు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలతో కలిసి ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌, మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌కు వారు ఫిర్యాదు చేశారు‌‌‌‌‌‌‌‌. అనంతరం మీడియాతో మాట్లాడారు. “పోలీసులు మా మగవాళ్లందరినీ అరెస్ట్ చేశారు. ఇంకొందరు ఊరు వదిలి పారిపోయారు. మేము మా భూములు ఇవ్వబోమని చెప్తున్నం. 

మాకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటామంటే మేము ఎలా బతకాలి? పోలీసులు వచ్చి ఎప్పుడు ఏం చేస్తారోనని భయం భయంగా బతుకుతున్నాం. 8 రోజులుగా మా పిల్లలు ఎక్కడున్నరో తెలియదు. వారిని కూడా తీసుకెళ్తామని చెప్తున్నరు. సీఎం రేవంత్‌‌‌‌ను కలిసేందుకు వెళ్తే బెదిరించి వెనక్కి పంపించారు" అని వారు పేర్కొన్నారు.

సీఎం‌‌‌‌‌‌‌‌ సోదరుడి అరాచకాలపైఒక్క కేసూ లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ల ఫ్యామిలీ ప్యాకేజ్‌‌‌‌‌‌‌‌గా మార్చేస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం సోదరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఫార్మా విలేజ్‌‌‌‌‌‌‌‌ను ఆపేది లేదని చెప్పేందుకు ఆయనెవరని నిలదీశారు. రైతులను బెదిరిస్తూ సీఎం సోదరుడు చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు వార్డు మెంబర్ కూడా కాదని, కానీ ఆయనకు ప్రొటోకాల్ ఇచ్చి కలెక్టర్ వచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. 

పోలీసులు రేవంత్‌‌‌‌కు ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో లగచర్ల బాధితుల కుటుంబీకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులు, బీసీ, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి పదే పదే ప్రస్తావిస్తున్న రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌‌‌‌‌‌‌‌లో గిరిజన మహిళలపై జరిగిన అఘాయిత్యాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదు. 

దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం కూడా ఉంది. ఇక్కడ జరిగే ఆకృత్యాలపై స్పందించాలనే విషయాన్ని ప్రధాని మరిచిపోయారా? లగచర్లలో రైతులు చనిపోయే వరకు స్పందించారా? మణిపూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదు’’ అని కేటీఆర్​అన్నారు.