దిశ కేసు మరో మలుపు తిరుగుతోంది. కేసులో నలుగురే కాదు..ఇంకొందరి ప్రమేయం ఉందంటున్నాయి ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు. దిశ కమిషన్ ముందు హాజరైన కుటుంబ సభ్యులు…. దీనిపై ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని.. ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇస్తామంటూ… ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. నలుగురు నిందితులతో పాటు… మరి కొందరి ప్రమేయం ఉందనే ఆరోపణలు చేస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు. హైకోర్టు విచారణ కమిషన్ ముందు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా పోలీసులు, గుడిగండ్ల గ్రామ పెద్దలు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. దిశా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఎన్ కౌంటర్ అయిన కొద్ది రోజులకే చెన్న కేశవులు తండ్రి కూర్మయ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు. అయితే కూర్మయ్య ప్రమాదం కేసులో తమకు అనుమానాలున్నాయన్నారు కుటుంబ సభ్యులు. దిశ హత్య జరిగిన రోజు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి… కుర్మయ్య ఇంటికి వచ్చాడనీ.. చెన్న కేశవులను తనతో పంపాలని కోరాడని కమిషన్ ముందు చెప్పారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి అరెస్టు, ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. ఈ విషయంలో శ్రీనివాస్ రెడ్డిని కుర్మయ్య నిలదీయడంతో…ఎక్కడ తన గురించి బయట పెడతాడో అని యాక్సిడెంట్ చేశాడని కమిషన్ కు లేఖ అందించారు.
హైకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటే ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇస్తామంటూ గుడిగండ్ల గ్రామస్థులు తమపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. అయినా తాము ఒప్పుకోకుండా.. న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు ఎన్ కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులు. వీటన్నింటిపై లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి పై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ని పోలీసులు విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి తమకి ప్రాణ హాని ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. పూర్తి వివరాలతో అఫిడవిట్ రూపంలో కమిషనర్ కు అందజేయాలని సూచించింది బెంచ్. ప్రాణ హాని ఉంటే పోలీసుల రక్షణ తీసుకోవచ్చని సూచించింది.