రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని రవికృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో 8 నెలల బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఏం జరిగిందంటే..?
రాయపోలు గ్రామానికి చెందిన మహేష్, ప్రవలిక దంపతుల కుమారుడు ప్రజ్వల్(8నెలలు)కు జ్వరం రావడంతో శనివారం(ఆగష్టు 10) రవి కృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటూ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి ఏ మేరకు వైద్యం అందించారో తెలియదు కానీ, ఉదయం టెస్టులు చేసి ప్లేట్లెట్స్ భారీగా పడిపోయాయంటూ హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. హుటాహుటీన తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.
శనివారం అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ఆదివారం ఉదయం వరకు టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేయటం వల్లనే తమ బిడ్డ చనిపోయాడని బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. రవి కృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ కు ప్రభుత్వ అనుమతులు లేవని వారు ఆరోపించారు. ఇలాంటి ఆసుపత్రులు ఇబ్రహీంపట్నం పరిధిలో పలు వెలుస్తున్నప్పటికీ వైద్య శాఖ పట్టించుకోవడం లేదని అన్నారు.