మగ బిడ్డ పుడితే.. ఆడ బిడ్డను ఇచ్చిన్రు

  •  భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో కుటుంబ సభ్యుల ఆందోళన

భద్రాచలం, వెలుగు: మగ బిడ్డ పుడితే.. ఆడ బిడ్డను ఇచ్చారంటూ భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో ఆదివారం హాస్పిటల్ లో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. దుమ్ముగూడెం మండలం కాటాయిగూడెం గ్రామానికి చెందిన ఉష నిండు గర్భిణి. కుటుంబ సభ్యులు డెలివరీ కోసం శనివారం రాత్రి భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో చేర్పించారు. డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డను హాస్పిటల్​సిబ్బంది ఉష కుటుంబ సభ్యులకు చూపించారు. 

తర్వాత మాతా శిశు కేంద్రానికి తీసుకెళ్లారు. ఆదివారం అక్కడి నుంచి తీసుకొచ్చారు. అయితే తాము మగ బిడ్డను ఇస్తే.. ఆడ బిడ్డను తిరిగిచ్చారంటూ ఉష బంధువులు హాస్పిటల్ లోనే ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఘటనపై డాక్టర్లు స్పందిస్తూ.. ఉషకు పుట్టింది ఆడబిడ్డ అని తెలిపారు. పాప చేతిపై ఎఫ్​సీహెచ్(ఫీమేల్​చైల్డ్) అని మార్క్ కూడా వేశామని స్పష్టం చేశారు. శనివారం రాత్రి మొత్తం ఐదు డెలివరీలు చేశామని చెప్పారు.  నలుగురికి ఆడపిల్లలు పుట్టగా, ఒక్కరికే బాబు పుట్టారని తెలిపారు.