సాయం కోరిన మహిళనే కాల్చి చంపిన పోలీసులు

లాస్​ఎంజెల్స్: అమెరికాలోని లాస్​ ఏంజిలిస్​లో గృహహింసను ఎదుర్కొంటున్న ఓ మహిళ ఫోన్​చేసి పోలీసుల సాయం కోరితే.. వాళ్లు ఇంటికి చేరుకొని ఆ మహిళనే కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  డిసెంబర్‌‌ 4వ తేదీ సాయంత్రం నియాని ఫిన్లేసన్‌‌(27) అనే మహిళ తన ప్రియుడు ఇంట్లో హింసిస్తున్నాడని, గృహహింసను రిపోర్ట్ చేయడానికి 911కి డయల్‌‌ చేసింది. 

పోలీసులు వెంటనే లాంకాస్టర్‌‌లోని ఆమె ఉంటున్న అపార్ట్‌‌మెంట్‌‌కు చేరుకున్నారు. డోర్​లోపలి నుంచి క్లోజ్​చేసి ఉండటంతో పోలీసులు బలవంతంగా తలుపు తెరిచారు. అప్పటికే అక్కడ నియోని తన ప్రియుడితో ఘర్షణ పడుతోంది. తన తొమ్మిదేళ్ల కూతుర్ని  ప్రియుడు తోసేసినందుకు అతన్ని చంపేస్తా అంటూ కత్తితో బెదిరిస్తున్నది. ఈ ఘర్షణలో పోలీసులు కాల్పులు జరిపారు.

నియోనికి బుల్లెట్లు తగిలాయి. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయింది. ఘటనపై నియోని కుమార్తె ఎక్సైయిషా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా అమ్మ కత్తితో బెదిరించడం వల్లే కాల్పులు జరిపినట్లు పోలీసులు అబద్ధం చెబుతున్నారు. నా తల్లి చనిపోవడానికి కారణమైన వారిని విచారించాలి” అని తొమ్మిదేళ్ల చిన్నారి డిమాండ్​ చేసింది. తమ కూతురి మరణానికి కారణమైన పోలీసు అధికారులపై నియోని తల్లిదండ్రులు కోర్టులో దావా వేశారు.