
కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన మహారాష్ట్రకు చెందిన యువతి నీలం షిండే కుటుంబానికి అమెరికా రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ వీసా మంజూరు చేసింది.
వీసా కోసం నీలం షిండే కుటుంబం విజ్ఞప్తి చేయగా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం (ఫిబ్రవరి28)న స్పందించిన ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయం వీసా ఇంటర్వ్యూ రావాలని నీలం షిండే కుటుంబానికి తెలిపింది.
నాలుగేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న నీలం..ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో కారు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆమెను యూసి డేవిస్ హెల్త్ హాస్పిటల్లో చేర్పించారు. ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో మెదడు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. అప్పటినుంచి నీలం షిండే కోమాలో ఉంది.
బాధితురాలి కుటుంబ సభ్యుల విజ్ణప్తి మేరకు నీలం తండ్రి, సోదరుడికి వీసా మంజూరు చేసింది అమెరికా. నీలం తండ్రి తానాజీ షిండే, సోదరులు రేపు (మార్చి1) అమెరికాకు వెళ్లనున్నారు.