- సర్కార్ భూములు కబ్జాచేశారని మాజీ సర్పంచ్‌పై గ్రామస్తుల ఆగ్రహం
- స్థలాలను స్వాధీనం చేసుకొని ఇంటికి తాళం
- పరస్పరం ఫిర్యాదులు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూరు మండలం సుర్భిర్యాల్ మాజీ సర్పంచ్ కుటుంబానికి, సార్వజనిక్ సంఘానికి మధ్య ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఏర్పడిన వివాదం మంగళవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సర్పంచ్ సవిత భర్త గణేశ్ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని ఆరోపించిన సార్వజనిక్ సంఘం ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవడమేకాకుండా అతని ఇంటికి తాళం వేయడం.. గణేశ్ తమపై దాడి చేసి తిట్టాడని గ్రామస్తులు ఆరోపించడం .. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోలీసులకు ఫిర్యాదులతో గ్రామం అట్టుడికింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ సర్పంచ్ సవిత భర్త గణేశ్ ప్రభుత్వ స్థలాలు కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేపట్టాడని ఆరోపిస్తూ సార్వజనిక్ సంఘం సభ్యులు ఆస్థలాలను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మాజీ సర్పంచ్ఇంటికి తాళం వేయడంతో పరస్పరం దూషించుకున్నారు. సోమవారం జరిగిన పరిణామాలపై సార్వజనిక్ సంఘంపై గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణేశ్‌కు వ్యతిరేకంగా గ్రామంలో ఇంటికొకరుచొప్పున వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తమపై గణేశ్ దాడి చేసి దూషించాడని, మాజీ సర్పంచ్, ఆమె భర్త అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సార్వజనిక్ సంఘం సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన గ్రామస్తులకు సీఐ రవికుమార్ నచ్చజెప్పినా వినకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏసీపీ గట్టు బస్వారెడ్డి, తహసీల్దార్ గజానన్ అక్కడకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ఫిర్యాదును పరిశీలించి మాజీ సర్పంచ్అవినీతిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ వీడీసీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కుల, గ్రామబహిష్కరణ చేసినా, జరిమానాలు విధించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు.