- ఇదంతా సీఎం రేవంత్ కుట్రలో భాగమే: మాజీ మంత్రి హరీశ్
- కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట
- ప్లాన్ ప్రకారమే పోలీసుల దాడి
- కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని చీప్ పాలిటిక్స్ చేస్తున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: జన్వాడ ఫామ్ హౌజ్‌లో జరిగింది ఫ్యామిలీ ఫంక్షన్ అని, రేవ్ పార్టీ కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే.. పోలీసులు రేవ్ పార్టీగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఫైర్ అయ్యారు.
‘‘ప్రజల దృష్టి మరల్చేందుకు జన్వాడ ఫామ్‌హౌజ్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నది. రాజ్‌పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని ముందే ప్రభుత్వ పెద్దలకు తెలుసు. పక్కా ప్లాన్ ప్రకారమే ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడి చేసి.. రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నం.
రాష్ట్రంలో బాంబులు పేలుతాయని రెండు రోజుల నుంచి మంత్రులు, కాంగ్రెస్ నేతలు అంటున్నరు. బీఆర్ఎస్ లీడర్ల ఇండ్లపై దాడులు చేయడం చూస్తే.. ఇది ప్రభుత్వం వేసిన స్కెచ్ అని అర్థమవుతున్నది. వృద్ధులు, చిన్న పిల్లలు, భార్యాభర్తలు పాల్గొన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నరు’’అని హరీశ్ రావు మండిపడ్డారు.
ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు లొంగొద్దు
కేటీఆర్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హరీశ్ ఫైర్ అయ్యారు. ‘‘కేటీఆర్, ఆయన సతీమణి ఫ్యామిలీ పార్టీకి వెళ్లకపోయినా.. వెళ్లినట్లు చిత్రీకరిస్తున్నరు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగొద్దు. నిజాయితీగా.. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయేలా వ్యవహరించొద్దు. రోజురోజుకూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ డ్రామా ఆడుతున్నరు.
రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని చీప్ పాలిటిక్స్ చేస్తున్నరు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి’’అని హరీశ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇంటి వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాన్ నిజ స్వరూపం బట్టబయలైందని విమర్శించారు.