
డాన్, తలాష్, మహర్షి లాంటి సినిమాలకు వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్.. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు వర్క్ చేశారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మోహనన్ మాట్లాడుతూ ‘ఇదొక మిడిల్ క్లాస్ మ్యాన్ కథ. తన కుటుంబం కోసం అతను ఏం చేశాడనే గుడ్ మెసేజ్‌తో ఉంటుంది.
దేశమంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్‌గా మారిపోయాయి. కుటుంబ సభ్యులు కలిసి ఉండటమే జరగడం లేదు. ఈ నేపథ్యంలో మనం నిర్లక్ష్యం చేస్తున్న మన పాత కాలపు కుటుంబ విలువలను మనకు ఈ చిత్రం గుర్తు చేస్తుంది. మంచి ప్రేమ కథ కూడా ఉంది. కమర్షియల్ వ్యాల్యూస్ ఉంటూనే కొత్తగా ప్రయత్నించాడు పరశురామ్. షూటింగ్ అంతా కాలనీ సెట్‌లో చేశాం. కథ, పాత్రలు ఎంత నేచురల్‌గా ఉన్నాయో, అంతే నేచురల్ ఉండేలా విజువల్స్ తీశాను.
లైటింగ్ కూడా సహజంగా చేశాం. తెరపై మాత్రం అందంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇక నా కూతురు మాళవిక మోహనన్ సొంతంగా గుర్తింపు తెచ్చుకుంది. నేను ఆమెను ఏ సినిమాకు రికమెండ్ చేయలేదు. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. నటిగా తన టాలెంట్ తనే ప్రూవ్ చేసుకోవాలి అని భావిస్తాను’ అన్నారు.