ఎడపల్లి, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కొడుకులకు ప్రాణాపాయం తప్పింది. నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన వడ్డే సాయిలు(45)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలు వరుణ్(13), రాంచరణ్(12) స్థానిక జడ్పీ స్కూల్లో 8, 7వ తరగతి చదువుతున్నారు. సాయిలు కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అప్పుల బాధ ఎక్కువవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో సాయిలు, భార్య రేఖ లిక్కర్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలతో తాగించారు. కొంత తాగిన తర్వాత చిన్నకొడుకుకు అనుమానం రావడంతో కూల్ డ్రింక్ వదిలేసి విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్అందరినీ 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వడ్డే సాయిలు చనిపోయాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలిద్దరికీ ముప్పు తప్పింది. ఎడపల్లి ఎస్సై పాండేరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వర్ణకారుడి ఆత్మహత్య
జనగామ అర్బన్, వెలుగు: ట్రైన్కింద పడి స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన అక్కినపెల్లి ప్రశాంత్(30) జనగామ పాత బీట్‌బజార్‌లో స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌నుంచి కాజీపేట వెళ్లే డౌన్‌లైన్‌లో ట్రైన్ కింద పడి చనిపోయాడు. కాజీపేట రైల్వే ఎస్సై ఆశోక్ డెడ్‌బాడీని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.