నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ

నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ

సామాజిక వ్యవస్థగా కుటుంబాల పాత్ర అత్యంత ప్రధానమైనది.  మానవుల ప్రాథమిక అవసరాలను తీర్చడంతో పాటుగా,  సమస్యల్లో వ్యక్తులకు  కుటుంబం అండగా ఉంటూ వారి అభివృద్ధికి చోదక శక్తిగా పని చేస్తోంది.  ప్రాథమిక సామాజీకరణ ఏజెంట్​గా సమాజ కట్టుబాట్లకు అనుగుణంగా మానవుడి సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని కుటుంబాలు ప్రభావితం చేస్తాయి.  కరోనా విపత్తు మానవుని మనుగడలో కుటుంబాల పాత్ర ఎంతటి కీలకమైనదో మరొక్కసారి స్పష్టంగా సమాజానికి అర్థం అయ్యేలా చేసింది.  

కానీ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా కుటుంబ వ్యవస్థ క్రమంగా తన పటుత్వాన్ని కోల్పోతుంది.  పాశ్చాత్య ధోరణుల ప్రభావం సమాజం మీద తీవ్రంగా పడింది.  అది కుటుంబ వ్యవస్థలో మార్పులకు కూడా  కారణమైంది.   మొదట కేవలం నగరాలకే పరిమితమైన విచ్ఛిన్న కుటుంబాలు నేడు  గ్రామీణ,  గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించాయి.  ఇందుకు జీవన విధానంలో వస్తున్న మార్పులు ప్రధాన కారణం.  

ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమానురాగాలు

కుటుంబ సంబంధాలు  ‘మేం, మా  అనే భావన నుంచి  నేను, నా అనే భావనకు’ వచ్చాయి.  గతంలో ఉమ్మడి కుటుంబాలలో కనిపించిన సాన్నిహిత్యం, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయత ప్రస్తుత విచ్ఛిన్న కుటుంబాలలో  కనబడటం లేదు. దీంతో కుటుంబ వ్యవస్థ క్రమంగా నిర్జీవమవుతున్నది. మానవ మనుగడలో,  మెరుగైన సమాజ నిర్మాణంలో కుటుంబాల పాత్రను గ్రహించిన ఐక్యరాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా జరుపుతోంది.

 ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తున్నది.  వయోవృద్ధుల  ఆత్మహత్యలు, ఆస్తి తగాదాలతో రక్త సంబంధీకులపైనే దాడులు చేయడం, కన్న వారు చనిపోతే కనీసం ఖననం చేయడానికి కూడా రాకపోవడం,  రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన పాఠశాల స్థాయి పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం వంటి ఘటనలు చూస్తూంటే ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతటి అగాధం ఏర్పడిందో స్పష్టంగా అర్థం అవుతుంది.   కారల్ మార్క్స్ మానవ సంబంధాల గురించి ప్రస్తావిస్తూ  ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నారు.  

ఇవాళ ఆర్థికపరమైన అంశాలకు ఉన్న విలువ, మానవ సంబంధాలకు ఉన్నట్టు కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అన్నీ ఆర్థికపరమైన అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి.  ఇవి కుటుంబాలలో అశాంతికి, కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.  

వయోవృద్ధుల సంరక్షణ నైతిక బాధ్యత

ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో వయోవృద్ధుల సంక్షేమం అతి ప్రధాన సమస్యగా మారింది.  ఇవాళ సమాజంలో వయోవృద్ధులు ఆనందంగా జీవించే పరిస్థితులు కనిపించడం లేదు. వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ మానవులలో మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి.  ఇందుకు కుటుంబ సభ్యులు వయో వృద్ధులను భారంగా భావించడం ప్రధాన కారణం.  వయోవృద్ధుల సంరక్షణ కుటుంబ వ్యవస్థ నైతిక బాధ్యత, కానీ, నేడు కుటుంబాలు ఆ బాధ్యత నుంచి సులభంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.  

జీవితాంతం కుటుంబ అభివృద్ధి కోసం కష్టపడి చివరి దశలో కుటుంబాలతో కలిసి సంతోషంగా ఉందామనుకుంటున్న వృద్ధులకు ఆ అవకాశమే ఇవ్వడం లేదు.  వారి కనీస అవసరాలను కూడా తీర్చకుండా, ప్రతి చిన్న విషయానికి చీదరించుకోవడంతో వృద్ధులు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. కొందరు వారి బాగోగులు చూసుకోలేమని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు.

ఇది వారిని మానసికంగా మరింతగా కుంగదీస్తున్నది.  ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాలకు తాము భారం అవుతున్నామని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  అమానవీయ ప్రవర్తనతో కుటుంబ వ్యవస్థ పతనమవుతున్నది.  కుటుంబ వ్యవస్థ బలంగా  ఉన్నప్పుడు మాత్రమే మానవత్వం పరిఢవిల్లుతుంది. సమాజంలో అసాంఘిక, అమావీయ ఘటనలు తగ్గుతాయి.

  కాలానుగుణంగా అన్ని వ్యవస్థల్లో మార్పులు రావడం అనేది అనివార్యం.   అయితే ఆ మార్పు భవిష్యత్తులో ఆవ్యవస్థ బలోపేతానికి  తోడ్పడేదిగా ఉండాలి తప్పితే  నిర్వీర్యం  చేసేదిగా ఉండకూడదు.   దానిని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది.  ఇప్పటికైనా సగటు మానవుని ఆలోచనల్లో మార్పులు వచ్చి కుటుంబ ప్రాధాన్యతను, కుటుంబాల్లో తమ బాధ్యతను  గుర్తించాలి. అప్పుడే నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ తిరిగి జీవం పోసుకుంటుంది.  లేకపోతే భవిష్యత్​లో కుటుంబ వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే  ప్రమాదం ఉంది.  అది మానవ జాతి మనుగడకే  ప్రమాదంగా మారుతుంది.

  డా. అనిల్ మేర్జ,
కాకతీయ యూనివర్సిటీ