పట్టా మార్పిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటం

పట్టా మార్పిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటం
  • గన్నేరువరం తహసీల్దార్‌‌‌‌ కాళ్లపై పడి వేడుకోలు

గన్నేరువరం, వెలుగు : తహసీల్దార్‌‌‌‌‌‌‌‌కు ముందస్తు సమాచారం ఇచ్చినా.. తమకు చెప్పకుండా ఉమ్మడి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని శుక్రవారం గన్నేరువరం తహసీల్దార్ ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి నారాయణరెడ్డికి సంజీవరెడ్డి, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, వసంత సంతానం.

నారాయణరెడ్డి తన ఆస్తిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచాడు. చిన్నకొడుకు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పేరున 2.25 ఎకరాలు ఉండగా.. ఆయనతో పాటు అతడి భార్య కూడా గతంలోనే చనిపోయారు. అనంతరం ఆ భూమి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి కూతురు ప్రియాంక పేరున పట్టా అయింది. ఆమె కూడా అనారోగ్యంతో కొన్ని నెలల కింద చనిపోయింది. దీంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయించుకునేందుకు నారాయణరెడ్డి కూతురు వసంత ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా శుక్రవారం రిజిస్ట్రేషన్‌‌‌‌ కోసం గన్నేరువరం తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న సంజీవరెడ్డి భార్య శ్యామల, కొడుకు రాజు, కూతురు జ్యోతితో కలిసి తహసీల్దార్ ఆఫీస్‌‌‌‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగింది. తన భర్త సంజీవరెడ్డిని వసంత కుటుంబసభ్యులు ఎక్కడో దాచిపెట్టారని ఆరోపించింది. ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా ఎలా రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తారని ఆఫీసర్లను నిలదీసింది.

భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని, భూమిని రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయవద్దంటూ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌ కాళ్లమీద పడి వేడుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌‌‌‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆస్తిని కుటుంబసభ్యుల అనుమతి లేకుండా పట్టా చేయడం లేదని, దరఖాస్తు ఇస్తే విచారణ చేపడతామన్నారు.