
- మతిస్థిమితం లేని బంధువును చూపిస్తూ.. బ్యాంకులో
- లైఫ్ సర్టిఫికెట్ అందజేత
- పింఛన్ తీసుకుంటూ మోసగిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు
- హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ఘటన
హసన్ పర్తి, వెలుగు: చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగి పింఛన్ 12 ఏండ్లుగా.. అదే పేరు కలిగిన బంధు వైన మతిస్థిమితం లేని వృద్ధుడి పేరిట కాజేస్తున్న ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాములు(తండ్రి పేరు కొమరయ్య) పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు.
అతను సర్వీస్పింఛన్ పొందుతూ 2012లో చనిపోయాడు. కానీ కుటుంబ సభ్యులు రాములు చనిపోయిన విషయాన్ని బ్యాంకు అధికారుల వద్ద దాచిపెట్టారు. పేరు, తండ్రి పేరు ఒకేలా ఉన్న రక్త సంబంధీకుడైన వేల్పుల రాములుకు మతి స్థిమితం లేకపోగా ఆయనను చూపిస్తూ పింఛన్ తీసుకుంటున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన కొడుకులు తమ తండ్రి బతికే ఉన్నట్టుగా ప్రతి ఏడాది బ్యాంకులో లైఫ్ సర్టిఫికెట్ కూడా అందజేస్తున్నారు. కాగా వేల్పుల రాములుకు ఆసరా పింఛన్ వస్తుండగా గతేడాది మే నెల నుంచి ఆగిపోయింది.
దీంతో కుటుంబ సభ్యులు పింఛన్ రావడం లేదని ఆఫీసర్లకు వినతిపత్రం అందించగా.. సర్వీస్ పెన్షన్వస్తున్నందున, ఆసరా పింఛన్ నిలిపివేశామని తెలిపారు. దీంతో మతిస్థిమితం లేని వేల్పుల రాములు మనుమడు కార్తీక్ అనుమానించి ఆరా తీశాడు. చనిపోయిన రిటైర్డ్ఉద్యోగి పింఛన్ ను తన తాత పేరిట కాజేస్తున్నట్లు గుర్తించి శుక్రవారం హసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హనుమకొండ ఎస్ బీఐ అధికారులకు సమాచారం అందించగా సర్వీస్ పింఛన్ , బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్సేకరిస్తున్నారు. ఏండ్లుగా రూ.లక్షల్లో పింఛన్ డబ్బులు కాజేసినట్టు తెలుస్తుండగా, పూర్తి వివరాలతో నిర్ధారణకు వచ్చాక నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.