మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ వార్

 మహారాష్ట్ర ఎన్నికల్లో  ఫ్యామిలీ వార్
  •  కన్నడ్ సెగ్మెంట్​లోభార్య వర్సెస్ భర్త
  •  బాబాయ్​కు అబ్బాయ్​తో పోటీ 
  • అజిత్ పవార్​కు సోదరుడి కొడుకు నుంచే సవాల్
  • ముంబైలో థాక్రే కజిన్ల ఫైట్

ముంబై: భార్యపై భర్త..  బాబాయ్ పై అబ్బాయ్.. తోబుట్టువుల పిల్లలు.. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీట్లో పోటీ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పోటీతో ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. అదే సమయంలో నేతల కొడుకులు, వారి బంధువులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొన్ని సీట్లలో ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల తరఫున బరిలో నిలిచారు.

 పవార్​ల కంచుకోట అయిన బారామతి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అజిత్  పవార్ నామినేషన్  దాఖలు చేయగా.. శరద్​ పవార్​ వర్గం నుంచి అక్కడ యుగేంద్ర పవార్​ పోటీకి దిగారు. యుగేంద్ర స్వయానా అజిత్ పవార్ సోదరుడి కొడుకే కావడం విశేషం. యుగేంద్రకు ఇది అరంగేట్రం కాగా, అజిత్  పవార్  ఇప్పటికి ఇక్కడి నుంచి ఏడుసార్లు గెలిచారు. ఒకసారి లోక్ సభకూ ఎన్నికయ్యారు. 

అలాంటి నేతపై ఈసారి అబ్బాయ్  పోటీచేస్తుండడంతో బారామతి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. గత లోక్ సభ ఎన్నికల్లో బారామతిలో పోటీ చేసిన అజిత్ భార్య సునేత్ర పవార్ ను ఆయన కజిన్, ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఓడించారు. ఇక కార్జాత్  జామ్ ఖేడ్ నియోజకవర్గంలో రోహిత్  పవార్ (అజిత్  సోదరుడి కొడుకు) ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి రామ్  షిండేపై పోటీచేస్తున్నారు. 

భార్యపై భర్త పోటీ

ఛత్రపతి శంభాజీనగర్ లోని కన్నడ్  నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్  జాదవ్  తన భార్య, శివసేన అభ్యర్థి సంజనా జాదవ్ (విడివిడిగా ఉంటున్నప్పటికీ ఇంకా విడాకులు తీసుకోలేదు) పై పోటీచేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి రావ్ సాహెబ్ దాన్వే కూతురే సంజన. ఆమె సోదరుడు సంతోస్  దాన్వే బీజేపీ అభ్యర్థిగా జాల్నాలో భోకర్దన్  నుంచి బరిలో దిగారు. 

మాజీ సీఎం విలాస్ రావ్  దేశ్ ముఖ్  కొడుకులు అమిత్  దేశ్ ముఖ్, ధీరజ్  దేశ్ ముఖ్  కాంగ్రెస్  అభ్యర్థులుగా లాతూర్  సిటీ, లాతూర్  రూరల్ లో పోటీచేస్తున్నారు. మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ్​ రాణె కొడుకులు నితేష్  రాణె(కుడాల్  నుంచి), నీలేష్​ రాణె (కంకావళి నుంచి) శివసేన, బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. 

ముంబైలో థాక్రే కజిన్ల బస్తీమే సవాల్

ముంబైలోని వివిధ సీట్లలో థాక్రే కజిన్లు పోటీచేస్తున్నారు. శివసేన (యూబీటీ) సిట్టింగ్  ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే వర్లీ నుంచి మళ్లీ పోటీచేస్తున్నారు. అతని కజిన్  (అమ్మ తరపున) వరుణ్  సర్దేశాయ్  అదే పార్టీ తరపున బాంద్రా ఈస్ట్ లో బరిలో దిగారు. మరో కజిన్, మహారాష్ట్ర నవనిర్మాణ్  సేన చీఫ్  రాజ్ థాక్రే కొడుకు అమిత్  థాక్రే ముంబైలోని మాహింలో పోటీచేస్తున్నారు. మాజీ మంత్రి గణేశ్  నాయక్  బీజేపీ అభ్యర్థిగా ఐరోలీలో పోటీచేస్తుండగా.. ఆయన కొడుకు సందీప్  పొరుగున ఉన్న బేలాపూర్ లో ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా బరిలో నిలిచారు. 

అలాగే, మంత్రి విజయ్  కుమార్  గవిట్ బీజేపీ తరపున నందర్బార్ లో బరిలో నిలవగా.. ఆయన కూతురు, మాజీ ఎంపీ హీనా గవిట్  ఇండిపెండెంట్ గా అక్కాల్ కువ నియోజకవర్గంలో పోటీచేస్తున్నారు. ఇక ఇస్లాంపూర్ లో ఎన్సీపీ (ఎస్పీ) స్టేట్  చీఫ్  జయంత్  పాటిల్  పోటీచేస్తుండగా.. ఆయన సోదరుడి కొడుకు, మాజీ మంత్రి ప్రజక్త్  తన్పూరే కూడా అదే పార్టీ టికెట్ పై రాహురిలో బరిలో నిలిచారు. ఎన్సీపీ మంత్రి చగన్  భుజ్ బల్.. ఎవాలాలో పోటీచేస్తుండగా.. ఆయన సోదరుడి కొడుకు, మాజీ ఎంపీ సమీర్  భుజ్ బల్.. నందగావ్ లో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు.