ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు అయిన వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన ఈ తెల్లవారుజామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వందలాది పాటలు రాసిన వంగపండుకు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు ఉంది. వంగపండు మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
వంగపండు 1943 జూన్ లో జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు పార్వతీపురం పెందబొండపల్లిలో జన్మించారు. జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు ఆరుగురు సంతానం. అందులో ముగ్గురు అక్కాచెళ్లెల్లు, ముగ్గురు అన్నాదమ్ములు. అన్నదమ్ములలో పెద్దవాడే వంగపండు. ఆయన ఎస్ఎస్ఎల్ సీ ఫెయిల్ కావడంతో.. బొబ్బిలో ఐటీఐ చేశారు. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఆయనకు విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్ మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఆయినా కూడా ఆయన ఉద్యమమే ఎక్కువ అనుకొని ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
వంగపండు 1972లో గద్దర్ తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. ఆయన మూడు దశాబ్ధాలలో 300లకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన కొన్ని పాటలు పది బాషలలోకి అనువదించబడ్డాయి. యంత్రమెట్లా నడుస్తుందంటే అనే పాట ఇంగ్లీష్ లో కూడా అనువదించబడి.. అమెరికా, ఇంగ్లాండ్ లలో విడుదలయింది. ఏపీ ప్రభుత్వం చేతుల మీదుగా 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు.
For More News..