ఇదే నా చివరి వీడియో.. ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్కాన్‌ నారంగ్‌ ఆత్మహత్యకి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ముందు రోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ఆమె.. ఆ మరుసటి రోజే ఉరివేసుకొని కనిపించింది.

ఉదయం తన తల్లి ముస్కాన్‌ గదిలోకి వెళ్లి చూడగా.. ఆమెకు గదిలో ఎక్కడా ముస్కాన్  కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ ఆమె తల్లి.. ఇంటి పైనున్న స్టోర్ రూంకి వెళ్లి చూసింది. అక్కడ ముస్కాన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. వెంటనే ముస్కాన్ కిందకు దింపి హాస్పిటల్ కి తీసుకెళ్లారు కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో.. ముస్కాన్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ముస్కాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ‘‘ఇదే నా చివరి వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నేను నా కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కన్విన్స్ చేసేందుకు ఎంతో ప్రయత్నించాను కానీ.. వాళ్లే రివర్స్‌లో నన్ను కన్విన్స్‌ చేసేందుకు చూశారు. నేను తీసుకుంటున్న ఈ నిర్ణయంలో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరినీ నిందించకండి’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది ముస్కాన్. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ వీడియోని కూడా పరిశీలిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఏ విషయంలో కుటుంబసభ్యులు ముస్కాన్‌ని కన్విన్స్ చేశారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.