తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. శనివారం (నవంబర్ 9) రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వివిధ బాషాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గణేష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ గణేష్ భౌతికాయాన్ని ఆయన రామాపురం నివాసంలో సందర్శనార్థం ఉంచారు. గణేష్‌కు కడసారి నివాళులర్పించేందుకు ప్రజలు, సినీ పరిశ్రమ, రాజకీయ నేతలు తరలిరానున్నారు. ఆదివారం (నవంబర్ 10) సాయంత్రం ఆయన సొంత గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ గణేష్ నేపథ్యం:
కాగా, 1 ఆగస్ట్ 1944 జన్మించిన గణేష్.. 1964 నుండి 1974 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. అనంతరం ఆయన సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ సినిమా, సీరియల్స్‌లో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు 400కు పైగా చిత్రాల్లో యాక్ట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలకు ముందు అతను ఢిల్లీకి చెందిన థియేటర్ ట్రూప్, దక్షిణ భారత నాటక సభ సభ్యుడిగా ఉన్నారు. గణేష్ టాలెంట్ గుర్తించిన డైరెక్టర్ K. బాలచందర్.. 1976లో తన దర్శకత్వంలో వచ్చిన పట్టిన ప్రవేశం మూవీలో అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా ద్వారా గణేష్ సినీ అరంగ్రేటం చేశారు. డైరెక్టర్ K. బాలచందరే గణేష్‌కు ఢిల్లీ గణేష్ అని పేరు పెట్టారు. సింధు భైరవి (1985), నాయకన్ (1987), మైఖేల్ మదన కామ రాజన్ (1990), ఆహా, అపూర్వ సగోధరార్గళ్ (1989), తెనాలి (2000), ఎంగమ్మ మహారాణి (1981) వంటి సినిమాల్లో నటించి తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇటీవల వచ్చిన ఇండియన్ 2, కాంచన 3 వంటి మూవీస్‌లోనూ ఢిల్లీ గణేష్ యాక్ట్ చేశారు.