ఏడుపాయల్లో కార్తీక శోభ

ఏడుపాయల్లో కార్తీక శోభ

పాపన్నపేట, వెలుగు:  ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ క్షేత్రం కార్తీక శోభ సంతరించుకుంది. సోమవారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. ఏడుపాయల పాలక మండలి చైర్మన్ బాల గౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి కార్తీక దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 అనంతరం భక్తులందరు అమ్మవారిని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. కొందరు ఏడుపాయల ఆలయం ముందు రహదారి పొడుగునా  జ్యోతులను వెలిగించగా, మరికొందరు ఆకులలో ప్రమిదలను వెలిగించి  నీటిపై వదిలారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఏడుపాయల క్షేత్రం దీపాల వెలుగులో భక్తులకు కనువిందు చేసింది.

మల్లన్న ఆలయంలో.. 

కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సహస్ర దీపాలంకరణ మహోత్సవం నిర్వహించారు. ఆలయంలో అర్చకులు, అధికారులు, మహిళలు శివలింగం, ఓం, స్వస్తిక్, డమరుకం, త్రిశూలం, ఆకారాలలో దీపాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, ఏఈఓ వైరాగ్యం అంజయ్య, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్​టౌన్: పట్టణంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆలయాలు, ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం పట్టణంలోని కోదండ రామాలయం, వేంకటేశ్వరాలయం, అయ్యప్ప దేవాలయం, హవేళీ ఘనపూర్​ మండలంలోని ముత్తాయికోట సిద్దిరామేశ్వరాలయంలో దీపాలను వెలిగించి సందడి చేశారు.