- 700 ఏండ్ల నాటి మహావృక్షానికి పునరుజ్జీవం
- 2018లో ఒకేసారి చీడ, చెద పురుగుల అటాక్
- సెలైన్ బాటిళ్లలో పెస్టిసైడ్స్ కలిపి ట్రీట్మెంట్ షురూ
- పైపుల ద్వారా ఊడల ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు
- ట్రీట్మెంట్ జరుగుతుండటంతో ఆరున్నరేండ్లుగా
- నో ఎంట్రీ.. వచ్చే వారమే సందర్శకుల కోసం రీఓపెన్
మహబూబ్‌నగర్, వెలుగు: అంతరించిపోయే ప్రమాదంలో పడ్డ పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి మహా వృక్షం మళ్లీ జీవం పోసుకుంది. 700 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ మహావృక్షానికి 2018లో చెదలు పట్టి, కొత్త ఊడలు రాక నిర్జీవమయ్యే పరిస్థితికి చేరింది. అప్పటినుంచి దీనిని బతికించేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దాదాపు ఆరున్నరేండ్ల ట్రీట్మెంట్ తర్వాత కొత్త ఊడలు రావడంతో పిల్లలమర్రి పునరుజ్జీవం పోసుకున్నట్టయింది.
దీంతో 2018 నుంచి పిల్లలమర్రి విజిట్‌పై విధించిన నిషేధాన్ని వచ్చే వారం నుంచి ఎత్తేసి సందర్శకులను అనుమతించనున్నట్టు అటవీ శాఖ ప్రకటించింది.
ఆరున్నరేండ్లుగా ట్రీట్మెంట్
పిల్లలమర్రిలో భాగమైన మహావృక్షం నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని ఊడలు నేలకు తాకితే అవి మరికొన్ని వృక్షాలుగా ఎదుగుతుంటాయి. కానీ గతంలో ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో కొందరు మహావృక్షం ఊడలపైకి ఎక్కడం, వాటిమీద పేర్లు చెక్కడం, చిన్నచిన్న ఊడలను తుంచడం చేస్తూ వచ్చారు. దీనికితోడు మహావృక్షానికి పెస్ట్(చీడ) ఆవహించడంతో కొమ్మలు, ఊడలు ఊడిపోతూ వచ్చాయి. దీనికి బోర్స్(చెదలు) కూడా తోడవడంతో చెట్టు ఎండిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. దీంతో 2018 సెప్టెంబర్ నుంచి పిల్లలమర్రిని మూసేశారు.
అనంతరం ఈ మహావృక్షాన్ని సంరక్షించే బాధ్యతను టూరిజం శాఖ నుంచి మహబూబ్‌నగర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కుఅప్పగించారు. మహావృక్షం సంరక్షణకు అప్పటి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ఫండ్స్ కేటాయించారు. ఫారెస్ట్సిబ్బంది మొదట చెద నివారణపై ఫోకస్ పెట్టారు. మహావృక్షానికి సెలైన్ బాటిళ్ల ద్వారా పెస్టిసైడ్స్‌ను ఇంజెక్ట్ చేశారు. కొన్ని నెలల వరకు ఈ చికిత్స అందించిన అనంతరం చెదలు పట్టిన కొమ్మలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు. తర్వాత మహావృక్షం నుంచి చిన్న చిన్న ఊడలు రావడంతో, ఆ ఊడలు బలంగా దిగేందుకు రెండు ఫీట్లు, ఫీటు, పది ఇంచుల పైపులను ఏర్పాటు చేశారు.
ఆ పైపు ద్వారా ఊడలు నేలలోనికి వెళ్లేలా చేశారు. ఊడలకు సూర్యరశ్మి తగిలేలా పైపులకు రంధ్రాలు కూడా పెట్టారు. దాదాపు మూడున్నరేండ్లుగా ఊడలకు ఎరువులు, మందులు వేయడంతో ఇప్పుడు అవి బలంగా పెరిగాయి. పైపులను చీల్చుకుంటూ భూమిలోకి చొచ్చుకుపోయి మహా వృక్షానికి ఆసరాగా నిలిచాయి. అలాగే ఈదురుగాలులు, భారీ వర్షాలకు మహావృక్షం దెబ్బతినకుండా ఉండేలా పెద్ద పెద్ద కొమ్మలకు మధ్యలో సపోర్ట్‌గా ఉండేందుకు రెండున్నర ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల నుంచి 20 ఫీట్ల ఎత్తుతో సిమెంటు పిల్లర్లను ఏర్పాటు చేశారు. వృక్షం బలంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఎరువులు వేస్తున్నారు.
చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
మహావృక్షాన్ని సంరక్షించేందుకు ఆఫీసర్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మర్రిచెట్టు ఎక్కడెక్కడ విస్తరించి ఉందో అక్కడ చుట్టూ ఐదు ఫీట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెట్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా నిఘా ఉంచేందుకు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే వాచర్లను కూడా నియమించారు. ఎవరైనా ఫెన్సింగ్ దూకి చెట్టు వద్దకు వెళ్లినా, కొమ్మలను తాకినా, ఆకులు తెంపినా ఫైన్ విధించనున్నారు.
పిల్లలమర్రి సర్క్యూట్ కోసం ప్రపోజల్స్
రాష్ర్టప్రభుత్వం పాలమూరును టూరిజం సర్క్యూట్‌గా డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు రోజులు నల్లమలలో పర్యటించారు. పాలమూరు చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో ఈ మొత్తం ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా చేపట్టాలని గవర్నమెంట్ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు తయారవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పిల్లలమర్రి సర్క్యూట్కూడా చేపట్టాలని టూరిజం శాఖ వద్ద ప్రపోజల్స్ ఉన్నాయి. ఆరున్నరేండ్ల తర్వాత పిల్లలమర్రిని ఈ వారంలోనే రీఓపెన్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రీఓపెనింగ్‌కు రావాల్సి ఉండగా, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రావడం లేదు.
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి,
ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్
టచ్ చేస్తే రూ. 5 వేల ఫైన్ వేస్తాం
పిల్లలమర్రికి ట్రీట్మెంట్ జరుగుతుండటంతో అక్కడికి ఎవరినీ అనుమతించడంలేదు. ఇటీవల కొద్ది రోజుల పాటు దూరం నుంచి మాత్రమే మహావృక్షాన్ని చూసేందుకు వీలుగా ఫుట్ ఓవర్‌ను నిర్మించాం. ప్రస్తుతం ఈ మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది. సందర్శనకు వచ్చే వారు చెట్టును ముట్టుకోరాదు. ఎవరైనా చెట్టును తాకితే.. సీసీ కెమెరాలో చూసి వెంటనే రూ.5 వేల ఫైన్ వేస్తాం. ఇందు కోసం గార్డ్స్‌ను కూడా నియమించాం. అలాగే దాదాపు రూ.50 లక్షలతో చుట్టూ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేశాం. చిన్న పిల్లలు ఆడుకోవడానికి పార్క్, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశాం.
- సత్యనారాయణ,
డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్