ప్యాలెస్​.. వనపర్తికో ఆభరణం

ప్యాలెస్​.. వనపర్తికో ఆభరణం

ఒకప్పటి తెలంగాణలో సంస్థానంగా వెలుగొందింది వనపర్తి. కాకతీయుల నుంచి నిజాం రాజుల కాలం వరకు ఈ ప్రాంతం సామంత రాజుల చేతిలో ఉంది. అందుకనే ఇక్కడ  రాజుల కాలంలో కట్టించిన నాటి దేవాలయాలు, కోటలు ఎక్కువ. ఈ జిల్లాకు వెళ్తే రాజభవనం లాంటి ప్యాలెస్​ని చూడొచ్చు. అంతేకాదు పద్దెనిమిదో శతాబ్దం నాటి ‘శ్రీ రంగనాయక స్వామి’ ఆలయం కూడా ఉంది ఈ జిల్లాలోనే. ఇవేకాకుండా కళాసాగర్ డ్యాంలో ఉరకలు వేసే కృష్ణా నది అందాల్ని చూడాలన్నా వనపర్తికి వెళ్లాల్సిందే. 

మనరాష్ట్రంలోని పురాతన దేవాలయాల్లో శ్రీ రంగనాయక స్వామి గుడి ఒకటి. శ్రీరంగాపురం​ గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థాన రాజులు కట్టించారు.   పద్దెనిమిదో శతాబ్దం నాటి ఈ గుడిని  శ్రీకృష్ణ దేవరాయలు దర్శించుకున్నాడని చెప్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే..  శ్రీ మహావిష్ణువు దశావతారాలను చూడొచ్చు. గుడి లోపల, గోపురం మీది శిల్పాలను తమిళనాడుకు చెందిన శిల్పులు చెక్కారు.  ప్రతి ఏడాది మార్చి నెలలో 15 రోజులు ‘రథోత్సవం’ నిర్వహిస్తారు. ఈ వేడుకని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివెళ్తారు. అంతేకాదు ఆలయ నిర్వాహకులు ప్రతి ఏడాది 300 జంటలకు సామూహిక వివాహాలు చేస్తారు.  ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు గుడి తెరుస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దర్శనం ఆపేస్తారు. మళ్లీ సాయంత్రం నాలుగ్గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 

ఖిల్లా ఘన్​పూర్ కోట

సైనిక స్థావరంగా ఉండి ఎన్నో యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచిన కోటలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. వాటిలో ఖిల్లా ఘన్​ఫూర్​ కోట ఒకటి. పదమూడో శతాబ్దం నాటి ఈ కోట రాజుల కాలంలో కట్టిన పకడ్బందీ కోటల్లో  ఒకటి. దీన్ని కాకతీయులకు సామంత రాజులుగా ఉన్న రేచర్ల పద్మనాయక రాజులు, గోన గన్నా రెడ్డి ఈ కోటని కట్టించారు. రెండు పెద్దగుట్టల్ని కలుపుతున్న ఈ కోటని చూడాలంటే రాళ్లతో కట్టిన మెట్ల దారి గుండా  ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాలి. కోట మీద మంచి నీళ్ల కోసం తవ్వించిన రెండు చెరువుల్ని చూడొచ్చు. అంతేకాదు రెండు రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తారు స్థానికులు.  అడ్వెంచర్​​ ట్రిప్స్​ని ఇష్టపడేవాళ్లకు  ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. దాంతో ఇక్కడ ర్యాపెల్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటివి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పంగల్ కోట

ఈ కోటని11, 12వ శతాబ్దం మధ్యలో కల్యాణి చాళుక్యులు కట్టించారు. దీనిలో ఏడు ద్వారాలు ఉంటాయి. ప్రధాన ద్వారాన్ని ‘ముండ్లగవిని’ అని పిలుస్తారు. సైనికులు ఇక్కడినుంచి శత్రువుల మీద గెరిల్లా దాడులు చేసేవారట. అందుకు సాక్ష్యంగా ఇక్కడ ఫిరంగులు దొరికాయి.  ఉయ్యాల మండపంతో పాటు చిన్న చిన్న నీటి కాలువలను కూడా చూడొచ్చు. కోట మీదికి చేరుకోవాలంటే రెండు గంటలు ట్రెక్కింగ్ చేయాలి. దారి పొడవునా పచ్చని చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు కనిపిస్తాయి. వనపర్తి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది పంగల్ కోట.

వనపర్తి ప్యాలెస్

‘రాజ మహల్’​గా పేరుగాంచిన ఈ ప్యాలెస్​ని రాణి శంకరమ్మ కట్టించింది. దాదాపు 125 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ప్యాలెస్​లో భారతీయ, మొఘల్​, బ్రిటిషర్స్​ ఆర్కిటెక్చర్​​ కనిపిస్తుంది. తెలంగాణలో నిజాం రాజుల పాలన ముగిశాక ఈ ప్యాలెస్​ని పాలిటెక్నిక్​ కాలేజీగా మార్చారు. తెలంగాణలో మనదేశ తొలి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ ప్రారంభించిన మొదటి పాలిటెక్నిక్ కాలేజీ ఇదే. ఇక్కడ సినిమా షూటింగ్​లు కూడా జరుగుతాయి. 

సైఫన్ టెక్నాలజీ డ్యాం

కృష్ణా నది మీద ఉంది ‘సరళ సాగర్​ డ్యాం’. వనపర్తిని పాలించిన రాజా రామేశ్వర రావు తన తల్లి సరళాదేవి జ్ఞాపకార్థం దీన్ని కట్టించాడు. అందుకనే ఈ డ్యాంని ‘సరళ సాగర్ డ్యాం లేదా ప్రాజెక్ట్’ అని పిలుస్తారు. అప్పట్లోనే ఈ డ్యాం నిర్మాణంలో ‘ఆటోమెటిక్ సైఫన్ సిస్టం’ అనే కొత్తరకం టెక్నాలజీ వాడారు. ఈ టెక్నాలజీ కోసం అమెరికా నుంచి ఇంజనీరింగ్ ఎక్స్​పర్ట్స్​ని రప్పించారట. ఈ టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటంటే...  డ్యాంలో  నీళ్ల కెపాసిటికి మించి చేరితే ఆటోమెటిక్​గా గేట్లు తెరుచుకొని నీళ్లు బయటకు పోతాయి.  అంతేకాదు ఆసియా ఖండంలో సైఫన్ టెక్నాలజీతో కట్టిన మొదటి డ్యాం ఇదే. దాంతో ఈ డ్యాంను చూసేందుకు, అక్కడ ఫొటోలు దిగేందుకు వీకెండ్స్​లో చాలామంది వెళ్తుంటారు.