టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత

ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సెప్టెంబర్ 6న  ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నిరుపేద చేనేత కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వడ్డేపల్లి కృష్ణ గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు.

లతితగీతాల రచయితగా వడ్డేపల్లి కృష్ణ రాణించారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో వడ్డేపల్లి కృష్ణ ప్రఖ్యాతిగాంచారు. మానేరు గడ్డ మీద నుంచి అంతులేని ఆత్మవిశ్వాసంతో ఎదిగిన ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలు సంతాపం ప్రకటిస్తున్నారు. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఇంతలోనే ఇలా జరగడంతో తెలుగు కవులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

సినారె ఇష్టపడిన రచయిత వడ్డేపల్లి కృష్ణ. పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ పూర్తి చేశారు. వందలాది లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. 40కి పైగా నృత్య రూపకాలు రాశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

Also Read : వంద కోట్లు అనుకుంటే వచ్చింది స‌గమే

వడ్డేపల్లి కృష్ణ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. 2017 లో వచ్చిన లావణ్య విత్ లవ్‌బాయ్స్ డైరెక్ట్ చేశారు. అలాగే, ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన గోభాగ్యం లఘు చిత్రానికి అంతర్జాతీయంగా పలు పురస్కారాలు లభించాయి. బతుకమ్మ, రామప్ప రామణీయం లాంటి అనేక లఘు చిత్రాలకు నంది పురస్కారాలు వచ్చాయి.