ఆ మూడు గుడులకు పాలకమండళ్లు లేనట్లే!
ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు జీవో జారీ
భద్రాచలం, యాదాద్రి, వేములవాడలో అప్లికేషన్లు తీసుకోవద్దని ఉత్తర్వులు
భద్రాచలం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 75 దేవాలయాల్లో ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు ఎండోమెంట్‍ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‍కుమార్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఒక్క రోజుకే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మనసు మార్చుకుంది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, వేములవాడ రాజరాజేశ్వరీ దేవస్థానం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలకు జారీ చేసిన పాలకమండళ్ల ఏర్పాటు జీవోను నిలిపివేసింది. తిరిగి ఆదేశాలు ఇచ్చేంతవరకు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ అసిస్టెంట్ కమిషనర్లు, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థానం ఈవోలు ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 72 దేవాలయాలకు అప్లికేషన్లు తీసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఆదాయాల వారీగా ఆలయాల విభజన
రాష్ట్రంలోని అన్ని ముఖ్య దేవాలయాల్లో ట్రస్టుబోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆలయాలను ఆదాయాల వారీగా విభజన చేసి ఉత్తర్వులు ఇచ్చింది. కోటి రూపాయలు, ఆపైన వార్షికాదాయం ఉన్న ఆలయాలు 33 ఉన్నట్లుగా పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం, జగన్నాథపురం(పాల్వంచ) కనకదుర్గ దేవస్థానం, కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర దేవస్థానం, ఖమ్మం జిల్లాలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈ జాబితాలో ఉన్నాయి. రూ. 25 లక్షల వార్షికాదాయం ఉన్న ఆలయాల జాబితాలో ఖమ్మం జిల్లా నుంచి కాల్వొడ్డు సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి దేవస్థానం, రెడ్డిపల్లిలోని మారెమ్మ దేవస్థానం, కమాన్‍బజార్‍లోని వేంకటేశ్వరస్వామి, ఖమ్మంలోని గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి, కందుకూరు వేంకటేశ్వరస్వామి, పెనుబల్లి నీలాద్రీశ్వరస్వామి, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 72 దేవస్థానాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేసేందుకు అన్ని ఆలయాలకు నోటిఫికేషన్లను పంపించారు. ఆయా ఎండోమెంట్ డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని ఇతర కీలక నేతల సిఫార్సు లెటర్ల ప్రకారం నామినేటెడ్ పదవులను తెలంగాణ సర్కారు ప్రకటించనుంది. ఈ ప్రకటన నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు.
మూడుసార్లు సేమ్ సీన్
దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ట్రస్టుబోర్డు ఏర్పాటుకు నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో చివరిసారిగా 2010 నుంచి 2012 వరకు కురిచేటి పాండురంగారావు చైర్మన్‍గా పాలకమండలి పనిచేసింది. తర్వాత కొంతకాలం ప్రభుత్వం ఎండోమెంట్ ప్రిన్సిపుల్ సెక్రటరీ చైర్మన్‍గా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్లుగా నేటి వరకు పాలకమండలి లేదు. ఇప్పటివరకు మూడుసార్లు సర్కారు నోటిఫికేషన్లు విడుదల చేసింది. కానీ ఒక్కసారి కూడా ఛైర్మన్, సభ్యులను నియమించలేదు. ప్రతిసారీ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత చేతులెత్తేస్తోంది. తాజాగా మరోసారి నోటిఫికేషన్ఇచ్చిన సర్కారు పాలక మండలి ఏర్పాటును నిలిపివేసింది.
జీవో నిలుపుదల నిజమే
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ట్రస్టుబోర్డు ఏర్పాటుకు జారీ చేసిన జీవోను నిలుపుదల చేసిన మాట వాస్తవమే. వేములవాడ, యాద్రాద్రికి కూడా నిలిచిపోయింది. అయితే మిగిలిన దేవాలయాలకు మాత్రం యధాతథంగా అప్లికేషన్లు తీసుకోవచ్చని కొత్తగా విడుదల చేసిన మరో జీవోలో పేర్కొంది.
‑ గౌరీశంకర్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఖమ్మం
For More News..