IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి

IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి

జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో సంజు శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు.7 ఫోర్లు, 9 సిక్సర్లతో 51 బంతుల్లో సంజు శాంసన్ మొదట సెంచరీ చేసుకున్నాడు. ఈ సిరీస్ లో అతనికి ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్ గా టీ20 కెరీర్ లో మూడోది. ఈ ఇన్నింగ్స్ పక్కన పెడితే.. శాంసన్ కొట్టిన ఒక సిక్సర్ విచారానికి గురి చేసింది. 

ఇన్నింగ్స్ 10 ఓవర్లో శాంసన్ తొలి బంతికి సిక్సర్ కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  మార్కరం వేసిన ఈ ఓవర్ రెండో బంతికి  లాంగాన్ దిశగా మరో సిక్సర్ బాదాడు. అది కాస్త ప్రేక్షకుల్లోని ఒక అమ్మాయి దవడకు తగిలింది. బంతిని బలంగా బాదడంతో  నొప్పి తట్టుకోలేక ఆమె ఏడ్చింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమెకు వెంటనే ఐస్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి వచ్చింది. ఇది గమనించిన శాంసన్  ఆ అమ్మాయిని గుర్తించి క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం శాంసన్ కొట్టిన ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ALSO READ | IND vs SA 4th T20: సెంచరీలతో శివాలెత్తిన శాంసన్, తిలక్.. సౌతాఫ్రికా ముందు కొండంత లక్ష్యం

ఈ మ్యాచ్ విషయానికి వస్తే  సంజు శాంసన్, తిలక్ వర్మ పోటీ పడి మరీ పూనకం వచ్చినట్టు ఆడారు. ఇద్దరు మెరుపు సెంచరీలు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 111 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 86 బంతుల్లోనే 210 పరుగులు జోడించడం విశేషం. ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం 23 సిక్సర్లు కొట్టింది. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ కు ఏకైక వికెట్ దక్కింది.