సాధారణంగా స్టార్ ప్లేయర్లు బాల్ పై ఆటోగ్రాఫ్ చేసి అభిమానులకి ఇస్తూ ఉంటారు. కానీ ఒక వీరాభిమాని బాల్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి ప్లేయర్లకు ఇచ్చాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. నిన్న( సెప్టెంబర్ 3) సౌత్ ఆఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. మొదట బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా ఇనింగ్స్ లో ఆసీస్ స్పిన్నర్ సంఘా 15 ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ తొలి 5 బంతులకి కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన ఈ యువ స్పిన్నర్.. చివరి బంతికి మాత్రం సిక్సర్ సమర్పించుకున్నాడు. అయితే ఈ సిక్సర్ కి ఒక విశేషం ఉంది. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఫెరారీ ఈ బంతిని ఎక్సట్రా కవర్స్ దిశగా ఆడగా.. ఆడియన్స్ లో ఉన్న ఒకరు అత్యుత్సాహం చూపిస్తూ బాల్ పై తన ఆటోగ్రాఫ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.
బంతిని మార్చిన అంపైర్లు:
ఈ క్రేజీ ఫ్యాన్ చేసిన పనికి ఆడియన్స్ అందరూ పగలబడి నవ్వారు. దీంతో ఏకంగా అంపైర్లు బంతిని మార్చేశారు. ఆ బంతి ప్లేస్ లో మరో బంతితో ఆటను కొనసాగించారు. నియమాలకు ఇది విరుద్ధమే అయినప్పటికీ.. ఈ సంఘటన నవ్వుల ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరోసారి ఇలా చేయకుండా అతనికి వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి తన విచిత్రమైన పని చేసి కాసేపు అందరిని అలరించి హైలెట్ గా నిలిచాడు.
ఆసీస్ క్లీన్ స్వీప్.. మార్ష్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్:
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టీ 20 ల మ్యాచుల సిరీస్ ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిధ్య దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. డెబ్యూ కుర్రాడు ఫెరారీ 21 బంతుల్లో 48 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మార్కరం(41) ఓపెనర్ హేన్డ్రిక్స్(42) జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తొలి బంతికే ఫామ్ లో ఉన్న షార్ట్ వికెట్ కోల్పోయినా.. ఓపెనర్ హెడ్ 48 బంతుల్లో 91 పరుగులు చేసి వార్ వన్ సైడ్ చేసేసాడు. అతనికి జోష్ ఇంగ్లిస్(42) స్టయినీస్(37) మంచి సహకారం అందించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హెడ్ నిలిస్తే..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కి దక్కింది.
Also Read : చంద్రయాన్ 3 అద్భుతం : విక్రమ్ ల్యాండర్ గాల్లోకి లేచి.. 40 సెంటీమీటర్లు ప్రయాణం