RCB Jersey: ఈసారైనా కోహ్లీ కల నెరవేరేనా..! కుంభమేళాలో RCB జెర్సీకి పుణ్యస్నానాలు

RCB Jersey: ఈసారైనా కోహ్లీ కల నెరవేరేనా..! కుంభమేళాలో RCB జెర్సీకి పుణ్యస్నానాలు

ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు టైటిల్ అనేది అందని ద్రాక్ష. ప్రతి సీజన్ ప్రారంభం ముందు ఈసాలా కప్ నామ్‌దే అంటూ(ఈసారి కప్ తమదే..) అంటూ ఆ జట్టు అభిమానులు హంగామా చేయడం తప్ప వారు సాధించింది ఏం లేదు. ఆటగాళ్లను మారుస్తున్నా. కెప్టెన్లను మారుస్తున్నా.. ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ కారణంగా ఆర్సీబీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ ఆ జట్టు ఎప్పుడు టైటిల్ గెలుస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 

ఈ క్రమంలో ఒక ఫ్యాన్ బెంగళూరు జట్టు మీదున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రసిద్ధ మహా కుంభమేళా పండుగ జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో పవిత్ర స్థలాన్ని సందర్శించారు. ఈ కుంభమేళాలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆర్సీబీ వీరాభిమాని త్రిబేని సంగం వద్ద గంగా నది పవిత్ర జలంలో తన RCB జెర్సీని ముంచిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సారైనా తమ జట్టుకు టైటిల్ రావాలని ఆ అభిమాని చేసిన పనికి ఆర్సీబీ ఫాన్స్ ఫిదా అవుతున్నారు.      

అభిమానులను సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. చాలా మంది ఈ వీడియోను ఇష్టపడ్డారు. ఇండియాలో క్రికెట్ పై ఎంత అభిమానం ఉందో ఈ వీడియో నిరూపించిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ కు చేరుకున్నా నిరాశే మిగిలింది. 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పోనీ ఈ ఏడాదైనా ఆ కరువు తీరేనా..! అంటే అదీ అనుమానమే. ఈ ఏడాది మెగా ఆక్షన్ లో జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఆ జట్టు పెద్దగా స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయలేదు.