PSL 2025: ఇండియాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లైవ్ స్ట్రీమింగ్ నిలిపివేత

PSL 2025: ఇండియాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లైవ్ స్ట్రీమింగ్ నిలిపివేత

ఇండియాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోనుంది. పహల్గామ్​ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ గురువారం (ఏప్రిల్ 24) ఇండియాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ అధికారిక ప్రసారకర్త అయిన ఫ్యాన్‌కోడ్ మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయదు.

ఏప్రిల్ 11 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు టోర్నీలో 13 మ్యాచ్ లో జరిగాయి. మే 18 వరకు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 31 మ్యాచ్ లు జరగనున్నాయి. రావల్పిండి క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో  ఫైనల్, ఎలిమినేటర్స్ తో సహా మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ చెరో ఐదు మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 6 జట్లు (ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్,పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్,కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్) టైటిల్ కోసం తలపడనున్నాయి. 

ఉగ్రవాదుల నరమేధం తర్వాత.. బీసీసీఐ ఇకపై పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడేది లేదని స్పష్టం చేసింది. తటస్థ వేదికలపైన కూడా పాక్ తో మ్యాచ్ లు ఆడేది లేదని.. ఇది ఫైనల్ అని తేల్చి చెప్పింది బీసీసీఐ. దీని ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్లు ఇకపై కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడనున్నాయి. ఐసీసీ ఈవెంట్స్ లో కూడా రెండు జట్లు ఒక గ్రూప్ లో ఉండేందుకు వీలు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది.