ఒడిశా, పశ్చిమ బెంగాల్ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడులను వారం రోజుల పాటు‘షేక్ ’ చేసిన ఫొని తుఫాన్ … తీరం దాటి పది రోజులైంది. ప్రాణ నష్టం జరగకుండా ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఫొని వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని భర్తీ చేయడానికి నవీన్ పట్నాయక్ చాలా చెమటోడుస్తున్నారు. మిగతా మూడు రాష్ట్రాలను కాస్తో కూస్తో కనికరించిన ఈ సూపర్ సైక్లోన్ … వెళ్లే ముందు తన విశ్వరూపాన్ని ఒడిశాపై చూపింది. రాష్ట్రంలోని మూడో వంతు జిల్లాలను నిలువునా ముంచింది.
తుఫాన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశాలోని పది జిల్లాల్లో పూరి ఒకటి. జిల్లా కేంద్రమే కాకుండా సిటీ, మునిసిపాలిటీ కూడా అయిన పూరిలో ఎక్కువమంది జనానికి కొబ్బరి తోటల పెంపకమే బతుకు దెరువు. ఫొని పుణ్యమా అని వందల ఎకరాల్లో కొబ్బరి చెట్లు నేలకూలాయి. దీంతో కొబ్బరి బొండాలు అమ్మి నాలుగు రాళ్లు వెనకేసుకునే స్థానికులకు ఆ ఆదరువు కరువైంది. కొబ్బరి పీచుతో తాళ్లు పేని కడుపు నింపుకునేవాళ్లకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేదెట్లా అని బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
తలదాచుకునే చోటు లేదు..
పూరి–భువనేశ్వర్ నేషనల్ హైవే పక్క గ్రామాల్లో తుఫాన్ దెబ్బకు వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. ఆ పల్లెల్లో ప్రజలు తలదాచుకోవటానికి గూడు లేక ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు. పూరికి వచ్చే టూరిస్టులు రోడ్ల వెంట కాసేపు ఆగి, కొబ్బరి బొండాలు తాగి, సేద తీరటం అలవాటు. కానీ.. ఇప్పుడు అక్కడ అలాంటి సీన్లు మచ్చుకైనా కనిపించట్లేదు. వేళ్లతో సహా ఒరిగిపోయిన చెట్లు, కరెంట్ స్థంభాలు, వైర్లు, బిల్ బోర్డులు, హోర్డింగ్‌లే అడుగడుగునా అగుపిస్తున్నాయి. ఈదురు గాలులవల్ల రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్తాచెదారాన్ని, చెట్ల కొమ్మలను తొలగించేందుకు పిప్లి, సట్సంఖ్, సాక్షి గోపాల్ వంటి ఊళ్లల్లో ఆయా గ్రామస్తులే ముందుకు వస్తున్నారు. మునిసిపాలిటీ సిబ్బందికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఎప్పుడూ వందలు, వేల సంఖ్యలో జనంతో నిండి ఉండే పూరి బీచ్‌కి ఇప్పుడు పట్టుమని పది మంది కూడా రాకపోవటంతో ఆ ప్రాంతం అంతా ఎడారిలా కనిపిస్తోంది. బీచ్ వెంట ఉన్న దాదాపు అన్ని హోటళ్లూ మూతపడ్డాయి. కరెంటు, వాటర్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది. దీంతో హోటళ్లు మూతపడ్డాయి.
జగన్నాథుడికీ తప్పని తిప్పలు..
ఫొని సైక్లోన్ వల్ల పూరి నగరంలో టూరిజానికి కోలుకోలేని స్థాయిలో నష్టం జరిగింది. దెబ్బతిన్న హోటల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని నవీన్ పట్నాయక్ సర్కార్ హామీ ఇచ్చింది. ఈ మేరకు టూరిజం సెక్రటరీ విశాల్ యాదవ్ స్థానిక హోటల్ ఓనర్లతో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందితో మీటింగ్ పెట్టి పరిస్థితిని సమీక్షించారు. రథయాత్రతో ప్రపంచ పటంలో నిలిచిన జగన్నాథ్ టెంపుల్పైనా తుఫాన్ ఎఫెక్ట్ బాగా పడింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ గుడికి గడచిన పది రోజుల్లో వచ్చినవారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. టెంపుల్ కాంప్లెక్స్‌లో చెట్లు విరిగి పడ్డాయి. దీంతో గుడి లోపల, బయట ప్రాంతాలను శుభ్రం చేయటానికి, భక్తులు కాళ్లు కడుక్కోవటానికి, ఇతర పనులకు నీళ్లు దొరకడం లేదు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహాప్రసాదం తయారు చేయడానికి అవసరమైన నీటిని అక్కడి రెండు బావుల నుంచి తెస్తున్నారు. అయితే ఇతర అవసరాలకు మాత్రం నీళ్లు సరిపోవడం లేదు. నగరంలో కరెంటు, వాటర్ సప్లయ్ ను ఎప్పటిలా కంటిన్యూ చేయటానికి సంబంధిత శాఖల సిబ్బంది కష్టపడుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. చక్కబెట్టాల్సింది చాలా ఉండటంతో అదంతా పూర్తి కావటానికి మరికొద్ది రోజులు పట్టేట్టు ఉంది.
భువనేశ్వర్ బాధలు..
తుపాను దెబ్బకి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వాసులకు నరకం కనిపిస్తోంది. ప్రధాని మోడీ ఈ నగరంలో వారం కిందట ఏరియల్ సర్వే చేశారు. కానీ, చాలా ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న అష్ట కష్టాలు ఆయన దృష్టికి రాలేదు. దేశంలో పచ్చదనం నిండుగా పరచుకున్న రాజధానుల్లో భువనేశ్వర్ ఒకటి. ఫొని దెబ్బకు అక్కడ సగానికిపైగా చెట్లు నేలకొరిగాయి. బిజూ పట్నాయక్ పార్క్ వంటి పెద్ద పెద్ద పార్కులు అనేకం బాగా డ్యామేజ్ అయ్యాయి. నందన్ కానన్ పార్క్ కళ తప్పింది. మెయింటెనెన్స్ కోసం ఆ పార్కును కొద్ది రోజుల పాటు మూసేశారు.
నగరంలో కరెంట్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలాయి. సిటీలో ఎక్కడికి వెళ్లినా ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ స్తంభాలు, తీగలే కాళ్లకు తగులుతున్నాయి. పవర్, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులోకి రావటానికి వారం రోజులకు పైగా ఆగక తప్పదు.
చెమటోడ్చిన నవీన్ పట్నాయక్
ఫొని తుఫాన్ వచ్చే నాటికి ఒడిశాలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కిపోయి ఉంది. దాదాపు వారం రోజులపాటు ఎక్కడ తీరం దాటుతుందన్న భయంతో నాలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోయాయి. చివరికి మే మూడున ఒడిశాలో తీరం దాటింది. తుఫాన్ జాడ తెలిసినప్పటి నుంచీ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చాలా ప్లాన్‌గా వ్యవహరించింది. లక్షలాది మందిని హుటాహుటిన తీరం నుంచి బయటకు తీసుకు వచ్చేసింది. వారికి అవసరమైన అన్ని సదుపాయాల్ని కల్పించింది. అందువల్లనే తుఫాన్ మృతుల సంఖ్య డబుల్ డిజిట్ దగ్గర ఆగిపోయింది. అయితే, ఆస్తి నష్టం బాగా జరిగినందున కరెంట్, ఇళ్లు వంటి కనీస వసతులు కల్పించటానికి రూ.17 వేల కోట్ల లాంగ్ టర్మ్ ప్యాకేజీని పట్నాయక్ డిమాండ్ చేస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటివరకు రూ.1380 కోట్లు మాత్రమే ప్రధాని మోడీ ప్రకటించారు.
స్పెషల్ కేటగిరీ కోసం పోరాటం
సముద్ర తీర రాష్ట్రాలన్నింటితో పోల్చితే ఒడిశాపైనే ప్రకృతి ఎక్కువగా పగపడుతోంది. ఆ రాష్ట్రాన్ని ప్రతి ఏడాదీ తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2013లో ఫైలిన్ సైక్లోన్, 2014లో హుద్‌హుద్, 2018లో తిత్లీ తుఫాన్, ఇప్పుడు ఫొని, ఇవన్నీ ఒడిశాకి శాపంగా మారాయి. ప్రకృతి బీభత్సాలు వరుసగా వెంటాడుతుండటంతో రాష్ట్రాన్ని స్పెషల్ కేటగిరీ కింద పరిగణించి, ఎక్కువ సాయం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతున్నారు.