Ranji Trophy: అరుణ్ జైట్లీ స్టేడియంలో గందరగోళం.. భద్రతా వలయంలో ‘కోహ్లీ’

Ranji Trophy: అరుణ్ జైట్లీ స్టేడియంలో గందరగోళం.. భద్రతా వలయంలో ‘కోహ్లీ’

ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రంజీ మ్యాచ్‌లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. విరాట్ కోహ్లీని కలిసేందుకు అభిమానులు ఒక్కసారిగా స్టేడియం నులుమూలల నుండి మైదానంలోకి చొచ్చుకొచ్చారు. ఏకంగా పదుల సంఖ్యలో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. దాంతో, పోలీసులు ఏం చేయలేని పరిస్థితి.

ముగ్గురితో మొదలు..

కోహ్లీ ఫీల్డింగ్‌ చేస్తుండగా మొదట ముగ్గురు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. నేరుగా కోహ్లీ వద్దకు వెళ్లిన ఆ ముగ్గురూ.. అతని పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. వెంటనే గ్రౌండ్ సిబ్బంది, పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.  అదే అదునుగా మ్యాచ్ ముగిసిన మరుక్షణం.. అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకొచ్చారు. స్టేడియం నులుమూలల నుండి అభిమానులు మైదానంలోకి రావడంతో పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి. చేసేదేమి లేక.. వెంటనే పోలీసులు వలయంలా ఏర్పడి అతనికి రక్షణ కల్పించారు. ఓ స్టార్‌ ప్లేయర్‌ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నిరాశ పరిచిన కోహ్లీ

దాదాపు పదమూడేళ్ల తరువాత రంజీల్లో పునరాగమనం చేసిన కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఢిల్లీ.. ఇన్నింగ్స్‌,19 పరుగుల తేడాతో రైల్వేస్‌పై విజయం సాధించింది. 334/7 ఓవర్‌ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఢిల్లీ 374 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 133 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన రైల్వేస్‌ 114 పరుగులకే కుప్పకూలింది. దాంతో, కోహ్లీకి రెండో సారి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.