దివంగత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆయన అభిమానులు ఆందోళన చేశారు. సికింద్రాబాద్ మారేడుపల్లి శ్మశానవాటికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన ఎమ్మెల్యే సాయన్న అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల ఆందోళన నేపథ్యంలో మారేడుపల్లి శ్మశానవాటికలో జరుగుతోన్న ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. సాయన్న అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు అభిమానులను సముదాయించేందుకు ప్రయత్నించిన వారు వినకపోవడంతో శ్మశానవాటిక నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం...అందుకే ఏర్పాట్లు చేయలేదు. దీంతో మారేడు పల్లి శ్మశాన వాటికలో సాయన్న అభిమానులు ఆందోళన చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని మండిపడ్డారు. 30 ఏండ్లు ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యేను ఇలా అవమానించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటులకు ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారికంగా అంత్యక్రియలు చేయరా అని ఫైర్ అయ్యారు. అధికారికంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా..ముఖ్య నేతలను ఆదేశాలు రాలేదని కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం.