ఇక లాభం లేదు.. వేరే దేశాలకు ఆడుకోండి: శాంసన్, చాహల్‌కు అభిమానుల సలహా

ఇక లాభం లేదు.. వేరే దేశాలకు ఆడుకోండి: శాంసన్, చాహల్‌కు అభిమానుల సలహా

వరల్డ్ కప్ 2023 కోసం 15 మంది సభ్యులు గల జట్టును బీసీసీఐ మంగళవారం(సెప్టెంబర్ 5) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటుదక్కగా.. శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్ వంటి అనుభవమున్న ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు.. అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది.  

జట్టు ప్రకటన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఇదే బెస్ట్ టీమ్ అని చెప్పడం అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్‌లను పక్కన పెట్టడం సమంజసమే అయినా.. సంజూ శాంసన్, యుజువేంద్ర చహల్‌లకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇక లాభం లేదు.. ఇతర క్రికెటర్ల వలే మీరు కూడా.. విదేశాలకు తరలిపోండి.. అని సూచిస్తున్నారు.

సూర్య vs శాంసన్.. ఎవరు బెస్ట్...?

ప్రస్తుత ఆసియా కప్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న శాంసన్ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచేదే. అంబటి రాయుడుకు జరిగిన అన్యాయమే.. సంజూకు జరుగుతోందని అభిమానులు చెప్తున్నారు. పోనీ అతన్ని పక్కన పెట్టారు సరే.. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్‌ను ఎందుకు ఎంపిక చేశారన్నది అభిమానులు సంధిస్తున్న మరో ప్రశ్న. సూర్య.. నీకు అసలు వరల్డ్ కప్ జట్టులో ఉండే అర్హత లేదు.. నీకు నువ్వుగా తప్పుకో అని ఓ అభిమాని ట్వీట్ చేయడం గమనార్హం.

చాహల్‌ను కావాలనే తప్పించారా..?

భారత క్రికెటర్లలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే.. అది చాహలే. జట్టులో ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు ఉండడో సెలెక్టర్లకు తప్ప మరొకరికి తెలియదు. స్వదేశంలో ఈ టోర్నీ జరగనుండటంతో ఈ లెగ్ స్పిన్నర్ నైపుణ్యం జట్టుకు బాగా కలిసి వచ్చేదని పలువురు అభిప్రాయడుతున్నారు. రాణిస్తున్నా.. కావాలనే పక్కన పెడుతున్నారనేది అభిమానుల వాదన. మొత్తానికి చాహల్, సంజూలకు అన్యాయం జరుగుతోందని అభిమానులు అంటున్నారు.