దుర్భర పరిస్థితులలో మాజీ క్రికెటర్.. ఆదుకోవాలని సచిన్‌కు విజ్ఞప్తులు

దుర్భర పరిస్థితులలో మాజీ క్రికెటర్.. ఆదుకోవాలని సచిన్‌కు విజ్ఞప్తులు

టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. బ్యాటర్ గా ఇతను 90 వ దశకంలో ఒక వెలుగు వెలిగాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు చిన్ననాటి స్నేహితుడిగా సుపరిచితుడు. టీమిండియా క్రికెట్ అరంగేట్రంలో సచిన్ కంటే బెస్ట్ బ్యాటర్ గా కితాబులందుకున్నాడు. అయితే అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. తక్కువ కాలం భారత క్రికెట్ జట్టు తరపున  ఆడిన కాంబ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. 

వినోద్ కాంబ్లీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుతున్నట్టు తెలుస్తుంది. అయితే అతని అనారోగ్య సమస్య ఏంటో బయటకు వెల్లడి కాలేదు. అతను నడవడానికి కూడా ఇబ్బంది పడే వీడియో ఒకటి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వీడియోలో దిక్కుతోచని స్థితిలో కనిపించాడు. కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు.. అతని స్నేహితుడు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను సహాయం కోరుతున్నారు. వినోద్ కాంబ్లీని ఆదుకోవాలని సచిన్ ను వేడుకుంటున్నారు.   

కాంబ్లీ 2013లో ముంబైలో డ్రైవ్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యాడు. సంవత్సరం క్రితం యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.  1991లో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్ లో కాంబ్లీ తొలిసారిగా భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 104 వన్డేల్లో రెండు సెంచరీలతో పాటు.. 14 హాఫ్ సెంచరీలు చేశాడు. 17 టెస్ట్ మ్యాచ్‌ల్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.